వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని రష్యా దేశస్తులు డేనీస్ ఎల్డండి, విక్టోరియా మొజావా శనివారం సందర్శించారు. రామలింగేశ్వర స్వామి వారు దర్శించుకోగా ఆలయ అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌లు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం రామప్ప దేవాల యం చరిత్రను, శిల్పకళ వైభవాన్ని టూరిజం గైడ్ వెంకటేశ్ వారికి వివరించగా శిల్పకళ సంపద బాగుందని వారు కొనియాడారు.
గిరిజన సంస్కృతిపై
అధ్యయనం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: జనజాతీయ గౌరవ్ దివస్ వేడుకల్లో భాగంగా మండల పరిధిలోని మేడారం ఇంగ్లిష్ మీడియం, ఊరట్టం ఆశ్రమ బాలికల పాఠశాల విద్యార్థినులు శనివారం మేడారంలోని సమ్మక్క–సారలమ్మ మ్యూజి యాన్ని సందర్శించారు. భగవాన్ బిర్సాముండా జయంతిని పురస్కరించుకుని గిరిజన విద్యార్థులకు సంస్కృతి సంప్రదాయాలు, కళలు, సాహిత్యం, ఆటలు, పాటలపై అవగాహన కల్పించేందుకు 15 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గిరిజన పరిశోధన సంస్థ ఆధ్వర్యంలోని మ్యూజియంలో ఉన్న కోయ, నాయకపోడ్ జనజాతుల కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానాలను విద్యార్థినులు ఆసక్తిగా పరిశీలించారు. అక్కడి గిరిజన వాయిద్యాలు, ఆయుధాలు, వ్యవసాయ పనిముట్లు, వస్త్రధారణ, ఆభరణాల గురించి తెలుసుకున్నారు. ఆయా అంశాలపై అధ్యయనం చేసి వివరాలను నమోదు చేశారు. ఈ సందర్శనతో విద్యార్థినుల్లో తమ జాతి పట్ల గౌరవం, స్వాభిమానం, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణపై అవగాహన పెరిగిందని ఉపాధ్యాయులు మైపతి సంతోష్, హనుమయ్య తెలిపారు. కార్యక్రమంలో 150 మంది విద్యార్థినులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
‘వికసిత్ భారత్‌కు పునాదులు’
ములుగు రూరల్: యువత ఆలోచనలే వికసిత్ భారత్‌కు పునాదులని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యువ సమవిధ్, వికసిత్ భారత్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన 2047 లక్ష్య సాధనలో యువత పాత్ర దేశాభివృద్ధి, నూతన ఆవిష్కరణలు నాయకత్వ లక్షణాలు తదితర అంశాలపై యువతతో చర్చించారు. కార్యక్రమంలో నాయకులు జవహర్‌లాల్, కృష్ణ సాగర్, నాగరాజు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
ములుగు: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల సంక్షేమం, సాధికారతకు విశేష సేవలందించిన వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలకు రాష్ట్రస్థాయి పురస్కారాలు అందించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి రామ్మోహన్ రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్య, ఉపాధి, పునరావాసం, క్రీడలు, సాంస్కృతిక, సామాజిక సేవా రంగాల్లో ప్రతిభ కనబర్చిన దివ్యాంగులు, సేవా సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. దరఖాస్తు ఫారాలు, మార్గదర్శకాలు శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను అవసరమైన ధ్రువపత్రాలతో ఈ నెల 18వ తేదీలోగా జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సమర్పించాలని కోరారు.


