ములుగు: జిల్లాలోని ప్రతీ గ్రామానికి తాగునీటిని అందించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలి పారు. కలెక్టరేట్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రామప్ప జలాశయానికి గోదావరి నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. దీంతో రామప్ప జలాశయం ద్వారా ములుగు, మల్లంపల్లి, వెంకటాపురం(ఎం), గోవిందరావుపేట మండలాల్లోని 152 గ్రామాలకు, ములుగు మున్సిపాలిటీకి మిషన్ భగీరథ నీటి సరఫరా అవుతుందని వివరించారు. ప్రస్తుతం రామప్ప జలాశయంలో ఒక సంవత్సరానికి సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. గోదావరి నదిపై ఉన్న రెండు ఇన్‌టేక్ వెల్స్, మూడు నీటి శుద్ధి కేంద్రాల ద్వారా తాడ్వాయి, కన్నాయిగూడెం, ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, వెంకటాపురం(కె) మండలాలకు తాగునీటిని అందిస్తున్నామని తెలిపారు. మిషన్ భగీరథ నీటి సరఫరాకు ప్రత్యామ్నాయంగా స్థానిక నీటి వనరులను వినియోగిస్తున్నామన్నారు. జిల్లాలోని 171జీపీల పరిధిలో 477 ఆవాసాలకు సంబంధించి 1,639 చేతిపంపులు, 810 సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ మోటార్లు, 335 బావులు ఉన్నాయని వివరించారు. 53 గొత్తికోయ గూడేల్లో 48 గ్రామాలకు చేతిపంపుల ద్వారా నీటిని అందిస్తున్నామని వివరించారు. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురైతే ప్రజలు సంబంధిత పంచాయతీ కార్యదర్శి లేదా మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సునీత 91001 20952, జేఈ శిరీష ఫోన్ నంబర్ 8712035486లో తెలపాలని సూచించారు.
ఓటరుగా నమోదుకు మరో అవకాశం
ఓటరు జాబితాలో పేర్లు లేని అర్హులకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించిందని కలెక్టర్ సహదేవరావు తెలిపారు. సర్ 2026 ప్రక్రియ, ఓటరు జాబితాలో పేర్లు నమోదుతో పాటు పలు అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ములుగు నియోజకవర్గంలో 27,842 మందిని ఏఎస్‌డీడీ కేటగిరీలో గుర్తించినట్లు తెలిపారు. వారిలో అర్హులు ఉంటే ఉంటే ఎన్యుమరేషన్ ఫారంతో పాటు అనుబంధం–బీ లేదా సీ ప్రకారం వివరాలను ఈఆర్‌వో, ఏఈఆర్‌వో లేదా బీఎల్‌వోకు సమర్పించాలని సూచించారు.
కలెక్టర్ హేమంత్ సహదేవరావు


