● రాష్ట్ర పంచాయతీరాజ్,
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
ములుగు: ప్రకృతి సంపదను పరిరక్షిస్తూ ఆదివాసీ గిరిజనులకు స్థిరమైన జీవనోపాధి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌లోని స్టేట్ చాంబర్‌లో అటవీ, పర్యావరణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్‌న్‌తో కలిసి మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో అటవీ, పర్యావరణ పరిరక్షణ, ఎకో టూరిజం అభివృద్ధి, ఏజెన్సీ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, ఆదివాసీ గిరిజనుల జీవనోపాధి తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. అటవీ, పర్యావరణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా జిల్లాకు వచ్చిన జయేష్ రంజన్‌కు మంత్రి జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ జిల్లాలోని దట్టమైన అడవులు, కొండలు, వాగులు, జలపాతాలు, సహజసిద్ధమైన ప్రకృతి ప్రాంతాలు పర్యాటకులను ఆకర్షించేలా ఉన్నాయని తెలిపారు. జిల్లా భౌగోళిక పరిస్థితులు, ప్రకృతి వనరుల ప్రత్యేకతలకు అనుగుణంగా ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ సహదేవరావు, ఎస్పీ రాంనాథ్ కేకన్, జిల్లా అటవీశాఖ అధికారి వికాస్ మీనా పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఎఫ్‌ఎస్‌ఐ ప్లేస్‌మెంట్ లింక్డ్ ట్రైనింగ్, మేక్ ఇండియా కేపబుల్ కార్యక్రమాల పోస్టర్లను మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు. యువతకు టాస్క్ కేంద్రం అందిస్తున్న ఉచిత నైపుణ్య శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ములుగు టాస్క్ కేంద్రం ద్వారా ఇప్పటి వరకు 220 మందికి శిక్షణ అందించినట్లు తెలిపారు. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాల్లోనూ ఉద్యోగావకాశాలు కల్పించేలా ఉచిత శిక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు.


