కేయూ క్యాంపస్: ప్లాంట్స్ సైన్సెస్ రంగంలో అత్యుతమ బోధన, పరిశోధనల అభివృద్ధికి కృషిచేసినందుకు కాకతీయ యూనివర్సిటీ బాటనీ విభాగం రిటైర్డ్ ఆచార్యుడు ఎస్‌ఎం రెడ్డికి ప్రొఫెసర్ హెచ్‌వై మోహన్‌రావు అవార్డు ఫర్ ఎక్సెలెన్స్ టీచింగ్ అండ్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ ప్లాంట్ సైన్సెస్–2026ను ప్రధానం చేశారు. ఆదివారం మైసూర్‌లోని ఇండియన్ బొటానికల్ సొసైటీ 49వ అఖిలభారత వృక్షశాస్త్ర సమ్మేళనంలో ఇండియన్ బొటానికల్ సొసైటీ (ఐబీఎస్)అధ్యక్షుడు ఎస్‌ఎస్ శర్మ చేతుల మీదుగా అవార్డును ఎస్‌ఎం రెడ్డి అందుకున్నారు.
భగవంతుడు
సర్వాంతర్యామి
మల్హర్(కాటారం): భగవంతుడు సర్వాంతర్యామి అని, ఆయనకు అనేక రూపాలు, కోటానుకోట్ల పేర్లు ఉన్నాయని.. ఏ రూపంలో స్మరించినా భక్తులకు కనిపిస్తూ వారి కోరికలు తీరుస్తారని అవదూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆహ్వానం మేరకు కాటారం మండలం ధన్వాడకు చేరుకున్న స్వామీజీకి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఘనస్వాగతం పలికారు. శ్రీధర్‌బాబు నివాసానికి చేరుకున్న స్వామీజీ, ధన్వాడలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో లోకకల్యాణార్థం నిర్వహించిన మహాపూర్ణాహుతి యజ్ఞంలో పాల్గొన్నారు. పూజ అనంతరం భక్తులకు ఆశీస్సులు అందించారు.
మూడేళ్ల నిరీక్షణ ఫలించింది..
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. స్వామివారి దివ్య ఆశీస్సులు లభించడం గొప్ప అదృష్టమన్నారు. మూడేళ్లుగా మా అమ్మ, జయశ్రీ, నా సతీమణి, కుటుంబ సభ్యుల నిరీక్షణ నేడు ఫలించిందన్నారు. స్వామివారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలు, ఉమ్మడి కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ప్రజలు, ముఖ్యంగా మంథని, ధన్వాడ ప్రజలు అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మంత్రి ప్రార్థించారు. ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, రామగుండం ఎమ్మె ల్యే ఠాకూర్ మక్కాన్‌సింగ్ దంపతులు, మంత్రి లక్ష్మణ్ కుమార్ సతీమణి, పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు పాల్గొన్నారు.
కరువు జిల్లాగా ప్రకటించాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాను పూర్తిస్థాయి కరువు జిల్లాగా ప్రకటించి, పంటలు సాగు చేయలేక నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని రావి నారాయణరెడ్డి భవన్‌లో సుధాకర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో పలు మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొని వరి సాగు చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లోనూ ప్రభుత్వం వరి సాగు చేయవద్దని సూచించడంతో అనేకమంది రైతులు పంటలు వేయలేక నష్టపోయారన్నారు.


