ములుగు: నేడు (శనివారం) కలెక్టరేట్లో నిర్వహించనున్న ఇన్నోవేషన్ పంచాయతీ కార్యక్రమం వాయిదా పడినట్లు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమాన్ని తిరిగి నిర్వహించే తేదీ, వివరాలను తదుపరి తెలియజేస్తామన్నారు. ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు చెందిన ఆవిష్కర్తలు ఈ మార్పును గమనించాలని కోరారు.
న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి
ములుగు రూరల్: జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ముత్యాల రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉద్యోగులు చేపడుతున్న సమ్మెకు ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. కోవిడ్ సమయంలో ఎన్హెచ్ఎం ఉద్యోగులు చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేపడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యుడు నరహరి, లోకప్రియ, భవ్య, తరుణ్, చందణ, సుహన, స్నిగ్ధ, పార్వతి, వెంకటేశ్వర్లు, కిరణ్కుమార్, అలివేలు, తదితరులు పాల్గొన్నారు.
గంతలు కట్టుకొని నిరసన
భూపాలపల్లి అర్బన్: ఎన్హెచ్ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపడుతున్న నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి నాలుగో రోజుకు చేరింది. శుక్రవారం ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకుని ప్రధాన రహదారి మీదుగా కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే వరకు ఐక్యంగా, శాంతియుతంగా పోరాటం కొనసాగిస్తామని ఎన్హెచ్ఎం జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బడితల రమేశ్, కార్యదర్శి మధుబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేశ్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రఘురాం, కోఆర్డినేటర్ ప్రవీణ్, డాక్టర్ జగదీశ్, సలహాదారులు శ్రీనివాస్, డాక్టర్ విజయ్, ఏఎన్ఎంలు వెంకటమ్మ, శ్రీలతలు పాల్గొన్నారు.
ఉద్యోగాల భర్తీకి
దరఖాస్తుల ఆహ్వానం
ములుగు రూరల్: జాతీయ ఆయూష్ మిషన్ ఆధ్వర్యంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ సునీత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో జాతీయ ఆయుష్ మిషన్లో ప్రజాఆరోగ్య కార్యక్రమాల్లో విధులు నిర్వహించేందుకు 10 ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 19 నుంచి 31వ తేదీ వరకు సమీకృత కలెక్టరేట్ కార్యాలయ భవనంలోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. అభ్యర్థులు 18 నుంచి 44 సంవత్సరాల వయసు కలిగి ఉండాలన్నారు. అర్హతలు, ఎంపిక విధానం, ఇతర నిబంధనలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ములుగు. తెలంగాణ.జీఓవి.ఇన్ లో పరిశీలించాలని సూచించారు.
కుక్కల దాడిలో
బాలికకు గాయాలు
కన్నాయిగూడెం: కుక్కల దాడిలో ఓ బాలికకు గాయాలైన సంఘటన మండల పరిధి లోని ముప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం ధర్మారావుపేటకు చెందిన ప్రణవి బతుకమ్మ పండుగకు అమ్మమ్మ ఇంటికి ముప్పనపల్లి గ్రామానికి వచ్చింది. శుక్రవారం ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో చిన్నారి చెంప మీద తీవ్ర గాయమైంది. గమనించిన గ్రామస్తులు 108లో ఏటూరునాగారం వైద్యశాలకు తరలించారు. ఈఎంటీ కుమ్మరి కల్యాణి, పైలెట్ సంతోష్లు ప్రాథమిక చికత్స అందించారు.


