ములుగు: జిల్లాలోని పర్యాటక ప్రాంతాల ప్రగతికి రాష్ట్రస్థాయి గుర్తింపు దక్కింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని శిల్పారామంలో శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి వేడుకల్లో కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావును ఘనంగా సత్కరించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,, మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టర్‌కు జ్ఞాపిక అందజేశారు. రామప్ప, మేడారం, లక్నవరం, బొగత, మల్లూరు తదితర పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషికి ఈ గుర్తింపు లభించింది. ఈ గౌరవం జిల్లా అధికారుల సమిష్టి కృషికి దక్కిందని కలెక్టర్ వెల్లడించారు.
రాజీమార్గమే రాజమార్గం
ములుగు: లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీ చేసుకోవడమే రాజమార్గమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ టి.కన్నయ్య లాల్ సూచించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు స్పెషల్ లోక్ అదాలత్ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసులను రాజీ కుదుర్చుకుని ప్రశాంతమైన జీవనాన్ని గడపాలన్నారు. కక్షిదారులు లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకుని తమ కేసులను రాజీ చేసుకోవాలని సూచించారు. లోక్ అదాలత్‌లో రాజీ చేసుకున్న కేసులకు మళ్లీ అప్పిల్ చేసుకునే అవకాశం ఉండదని తెలిపారు. అదే తుది తీర్పుగా పరిగణించబడుతుందని తెలిపారు. స్పెషల్ లోక్ అదాలత్‌లో ఏర్పాటు చేసిన బెంచ్ ద్వారా పెండింగ్‌లో ఉన్న 13 బ్యాంకు పీఎల్‌సీ కేసులను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు, న్యాయవాదులు, పోలీసు అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు వేగంగా పూర్తిచేయాలి
ములుగు: గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రతిపాదించిన అన్ని అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజారామయ్యర్ కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఆమె కమిషనర్ హనుమంతరావుతో కలిసి కలెక్టర్లతో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి అదనపు కలెక్టర్ సంపత్‌రావు వీసీలో పాల్గొన్నారు. ఈ సందర్భగా శైలజారామయ్యర్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు టైర్ 1, 2, 3లో ప్రతిపాదించిన అన్ని అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలోగా పూర్తయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇందుకోసం అవసరమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలన్నారు. పనులు క్షేత్రస్థాయిలో వెంటనే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టెండర్లు పూర్తయిన వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. ఇంజనీరింగ్ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అవసరమైతే స్థానిక ఎమ్మెల్యే, మంత్రులతో కూడా సమన్వయం చేసుకొని పనులకు సంబంధించిన ప్రక్రియలో జాప్యం జరగకుండా చూడాలని ఆదేశించారు. ఈ వీసీలో వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్‌కు విద్యార్థిని ఎంపిక
గోవిందరావుపేట: మండల పరిధిలోని చల్వాయి ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎస్.సంరక్షిత రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్ పోటీలకు ఎంపికై ంది. చల్వాయిలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ పోటీలు నిర్వహించారు. ఇండియన్ ఎనర్జీ బాస్కెట్–2047.. అవకాశాలు, అవరోధాలు అనే అంశంపై నిర్వహించిన పోటీల్లో జిల్లాలోని 18 పాఠశాలల విద్యార్థులు పాల్గొనగా ఈ పోటీల్లో సంరక్షిత ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ నెల 29న హైదరాబాద్‌లోని ఎస్సీఈఆర్‌టీ (స్కెర్ట్)లో నిర్వహించే రాష్టస్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కాటం మల్లారెడ్డి, విద్యార్థిని సంరక్షితతో పాటు గైడ్ ఉపాద్యాయురాలు అందె రమాదేవిని అభినందించారు.


