● ఏడీజీపీ
సంజయ్‌కుమార్ జైన్
గోవిందరావుపేట: బెటాలియన్‌లో ఆధునిక మౌలిక వసతులను ప్రభుత్వం కల్పించిందని తెలంగాణ పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఏడీజీపీ) సంజయ్‌కుమార్ జైన్ తెలిపారు. మండల పరిధిలోని చల్వాయిలో గల 5వ బెటాలియన్(టీజీఎస్పీ) ఆవరణలో నూతనంగా నిర్మించిన గార్డ్ రూమ్, గ్యాలరీ షెడ్లు, రిక్రియేషన్ హాళ్లను మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. పోలీస్ సిబ్బంది అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టిన పలు నిర్మాణాలు భేష్‌గా ఉన్నాయని తెలిపారు. బెటాలియన్ సిబ్బంది విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. అనంతరం నూతన నిర్మాణాలను పరిశీలించిన ఆయన నిర్మాణాల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేస్తూ బెటాలియన్ అభివృద్ధికి అధికారులు చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం సిబ్బందితో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఏఎస్పీ మానన్ భట్, 5వ బెటాలియన్ కమాండెంట్ సుబ్రహ్మణ్యం, అదనపు కమాండెంట్ సీతారాం, సహాయ కమాండెంట్ కృష్ణప్రసాద్, ఆర్‌ఐలు భాస్కర్, వెంకటేశ్వర్లు, సాయిబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


