ములుగు రూరల్: మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జాతీయ రహదారిపై వంట కార్మికులతో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ హరే రామ హరే కృష్ణ స్వచ్ఛంద సంస్థకు అల్పాహార పథకం అప్పగించడం కార్మికులను రోడ్డున పడేయడమేనని తెలిపారు. కోడిగుడ్ల ధరలు మార్కెట్‌లో అధికంగా పెరగడంతో ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు సరిపోవడం లేదన్నారు. తక్షణమే కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. ఎన్నికల సమయంలో వంట కార్మికులకు రూ.10 వేల వేతనం చెల్లిస్తామని హామీనిచ్చి అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అక్షయ పాత్ర సంస్థ అందిస్తున్న అల్పాహారం సరిగా ఉండడం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపణలు చేసినా సీఎం, మంత్రులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండి నర్సయ్య, ముత్యాల రాజు, ఇంజం కొమురయ్య, శ్యాంసుందర్, గడ్డం భారతి, రాజకుమారి, సమ్మక్క, పద్మ, శోభ, అమృత, భవాని, కమలక్క, లక్ష్మి, నాగమణి తదితరులు పాల్గొన్నారు.
యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
రవీందర్


