● డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు
ములుగు: ప్రజలకు వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం చేస్తే సీహెచ్‌ఓలు, హెచ్‌ఏలు, ఏఎన్‌ఎంలపై చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17న సాక్షిలో వైద్యులు రారు, సిబ్బంది ఉండరు శీర్షికన ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించి సమగ్ర విచారణ జరిపిస్తున్నట్లు వెల్లడించారు. పీహెచ్‌సీల సేవలు, వైద్య సిబ్బంది హాజరును పర్యవేక్షించేందుకు డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు, ప్రోగ్రాం ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. మెడికల్ ఆఫీసర్లు, వైద్య సిబ్బంది స్థానికంగానే ఉండాలని, లేదంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధులకు హాజరయ్యే వైద్యాధికారులు, సిబ్బంది తమ హాజరును జిల్లా వాట్సాప్ గ్రూపులో నమోదు చేయాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేసిన, సమయపాలన పాటించకున్నా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లా బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు.


