ఏటూరునాగారం: ఏజెన్సీలోని గిరిజనుల కష్టాలు తీరడం లేదు. వర్షం వచ్చినా.. వాగువచ్చినా వారికి నడకదారే శరణ్యంగా మారుతుంది. ఒక్కోసారి వాగులు ఉధృతంగా ప్రవహిస్తే ఇళ్లకే పరిమితం అవుతున్న పరిస్థితి. ఏటూరునాగారం మండల పరిధిలోని కొండాయి–దొడ్ల గ్రామాల మధ్యలోని జంపన్నవాగు బ్రిడ్జి నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. అదే ప్రాంతంలో ప్రజల రాకపోకలకు కోసం నిర్మించిన తాత్కాలిక రోడ్డు భారీ వర్షానికి వరద వచ్చి ఆదివారం కొట్టుకుపోయింది.
రూ.16కోట్లతో బ్రిడ్జి పనులు
భారీ వర్షం కురిస్తే జంపన్నవాగులోకి వరద వచ్చి చేరడంతో తాత్కాలికంగా కొండాయి–దొడ్ల మధ్యలోని రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో కొండాయి, మల్యాల, గోవిందరాజుల కాలనీ, కొత్తూరు, ఐలాపూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాల ప్రజలు నిత్యావసర సరుకులు తెచ్చుకునేందుకు వెళ్లాలంటే ఇద్దరు, ముగ్గురు కలిసి వాగులో ఈత పడి దొడ్లకు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. గత మూడేళ్ల నుంచి ఇదే దుస్థితి నెలకొంది. మంత్రి సీతక్క చొరవతో ఆర్‌అండ్‌బీ అధికారుల పర్యవేక్షణలో రూ.16 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కొండాయి బ్రిడ్జికి ఏడు పిల్లర్లు, రెండు అబాడ్స్‌మెంట్ పూర్తి కాగా పిల్లర్లపై గడ్డర్స్‌ను అమర్చారు. కానీ ఇంకా స్లాబ్ పడలేదు. దీంతో ప్రజలకు బ్రిడ్జి వినియోగంలోకి రాలేదు.
ఎలిశెట్టిపల్లి వద్ద బ్రిడ్జి నిర్మించాలని వేడుకోలు
మండలంలోని ఎలిశెట్టిపల్లి, కొత్తూరు గ్రామాలకు బన్నాజీబంధం నుంచి వెళ్లాలంటే జంపన్నవాగు దాటి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో వర్షాకాలంలో ఆయా గ్రామాల ప్రజలు ఏం అవసరం వచ్చినా మండల కేంద్రానికి రావాలంటే తిప్పలు తప్పటం లేదు. ఉప్పొంగి ప్రవహించే జంపన్నవాగును దాటలేక ఇళ్లకే పరిమితమై ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది నవంబర్‌లో ఎలిశెట్టిపల్లి వద్ద సీతక్క చొరవతో బ్రిడ్జి నిర్మాణానికి భూమి నమూనాలను అధికారులు సేకరించారు. ఇంజనీరింగ్, శాస్త్రవేత్తలు కూడా వచ్చి పరిశీలించారు. కానీ ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి పనులు చేపట్టలేదు. బ్రిడ్జి లేకపోవడంతో ఎలిశెట్టిపల్లి, కొత్తూరు గ్రామాల ప్రజలు వాగులో నుంచి నడిచేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంత్రి సీతక్క చొరవతో ప్రస్తుతం అక్కడ పడవలను ఏర్పాటు చేశారు. మంత్రి సీతక్క తక్షణమే స్పందించి బ్రిడ్జి నిర్మాణంపై దృష్టి సారించాలని ఆయా గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు.
భారీ వర్షానికి
కొట్టుకుపోయిన కొండాయి–
దొడ్ల తాత్కాలిక రోడ్డు
ఐదు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
ఇబ్బందులు పడుతున్న
ఆయా గ్రామాల ప్రజలు
జంపన్నవాగుపై కొనసాగుతున్న
హైలెవల్ బ్రిడ్జి పనులు


