● తినేందుకు ఇబ్బండి పడిన విద్యార్థులు
ఏటూరునాగారం: మండల పరిధిలోని చిన్నబోయినపల్లి బాలుర ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులకు వండిపెడుతున్న అన్నం ముద్ద ముద్దగా కావడంతో విద్యార్థులు తినేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఐటీడీఏ పరిధిలోని బాలుర గిరిజన ఆశ్రమ పాఠశాలలో 330 మంది విద్యార్థులు 3 నుంచి 10వ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్నారు. ఆదివారం స్పెషల్‌గా బగార రైస్ తయారు చేశారు. కానీ ఆ అన్నం ముద్దలు ముద్దలుగా ఉండి రుచిగా లేకుండా పోయింది. నాసిరకం బియ్యాన్ని జీసీసీ అధికారులు సరఫరా చేసినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పేరుకే సన్నబియ్యం చూస్తే దొడ్డు రకం బియ్యంగా ఉండడం గమనార్హం. ఈ విషయంపై సాక్షి డీడీ జనార్దన్ వివరణ కోరగా బియ్యాన్ని పరిశీలించి బాగాలేకపోతే వాటి స్థానంలో వేరే బియ్యాన్ని పంపిస్తామని వివరించారు.


