చెక్కుబౌన్స్‌ కేసుల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

చెక్కుబౌన్స్‌ కేసుల పరిష్కారం

Jul 19 2026 1:32 AM | Updated on Jul 19 2026 1:32 AM

ములుగు: జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన ప్రత్యేక లోక్‌ అదాలత్‌లో 10 చెక్కుబౌన్స్‌ కేసులు పరిష్కరించినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ కన్హయ్యలాల్‌ తెలిపారు. పెండింగ్‌లో ఉన్న 10 చెక్కు బౌన్స్‌ కేసులను పరిష్కరించి రూ.14,72,973లను సెటిల్‌ చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జూనియర్‌ సివిల్‌ జడ్జి జి.జ్యోత్స్న, అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి మధులికతేజ, జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బాలుగు చంద్రయ్య, ఉపాధ్యక్షుడు రంగోజు భిక్షపతి, లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సభ్యుడు మేకల మహేందర్‌, బానోత్‌ స్వామిదాస్‌ తదితరులు పాల్గొన్నారు.

నేటితో దరఖాస్తులకు గడువు ముగింపు

ములుగు: హైదరాబాద్‌లోని తెలంగాణ షెడ్యూల్డ్‌ కులాల స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ–2027 రెసిడెన్షియల్‌ కోచింగ్‌కు ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు నేటితో గడువు ముగియనున్నట్లు జిల్లా షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమ శాఖ అధికారి కొమురయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులకు జూలై 26న ఉదయం 11 గంటలకు హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైనన్స్‌ కళాశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజలకు మెరుగైన

వైద్యసేవలు

గణపురం: ప్రభుత్వ వైద్యశాలలో నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి మధుసూదన్‌ అన్నారు. శనివారం గణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఆరోగ్యకేంద్రంలోని ల్యాబ్‌, ఫార్మసీ తదితర విభాగాలను పరిశీలించారు. అనంతరం గణపురం–1 సబ్‌సెంటర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని రకాల వ్యాక్సిన్లు, మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి అనూష తదితరులు పాల్గొన్నారు.

ప్రవేశాలకు

ఎంపిక పోటీలు

భూపాలపల్లి అర్బన్‌: రాష్ట్రంలోని తెలంగాణ క్రీడా అకాడమీలు, ప్రాంతీయ క్రీడా పాఠశాలలు, స్పోర్ట్స్‌ హాస్టళ్లలో 2026–27 విద్యా సంవత్సరానికి ఉచిత ప్రవేశాల కోసం బాలబాలికల నుంచి ఎంపిక పోటీలు ఈ నెల 20 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన మరియు క్రీడల అధికారి రఘు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్‌, ఖమ్మం, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌, గచ్చిబౌలి, హనుమకొండ కేంద్రాల్లో సైక్లింగ్‌, రెజ్లింగ్‌, వాలీబాల్‌, అథ్లెటిక్స్‌, కబడ్డీ, హ్యాండ్‌బాల్‌, ఫుట్‌బాల్‌, హాకీ, జిమ్నాస్టిక్స్‌, స్విమ్మింగ్‌ విభాగాల్లో ఎంపికలు జరుగుతాయన్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు వయస్సు, స్టడీ సర్టిఫికెట్‌, జనన ధృవీకరణ పత్రం లేదా పదో తరగతి మెమో, ఆధార్‌ లేదా నివాస ధృవీకరణ పత్రం, 10 పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలతో హాజరుకావాలని సూచించారు. అర్హత వయస్సు, ఎంపికల తేదీలు, వేదికలు, క్రీడాంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు జిల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

దరఖాస్తుల స్వీకరణ

భూపాలపల్లి రూరల్‌: సివిల్‌ సర్వీసెస్‌ (ఐఏఎస్‌/ఐపీఎస్‌) ఐఎఫ్‌ఎస్‌ (ప్రిలిమ్స్‌ కం మెయిన్స్‌) ఉద్యోగాలకు 10 నెలలు ఉచిత శిక్షణ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్‌ కులముల అభివృద్ది అధికారి కస్తూర్తి జైభీమ్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణకు నేడు (ఆదివారం) సాయంత్రం వరకు అవకాశం ఉందన్నారు. 27న ఎంపిక పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement