● ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్
ములుగు: మీసేవ కేంద్రాలలో వినియోగదారుల నుంచి అధిక రుసుము వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈ డిస్ట్రిక్ మేనేజర్ దేవేందర్ తెలిపారు. ములుగు మున్సిపాలిటీ పరిధిలోని పలు మీసేవ కేంద్రాలను మీసేవ మేనేజర్ విజయ్‌తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ మీ సేవ కేంద్రాల్లో కొత్తగా వచ్చిన ఈ మెమో ప్రింట్, యూరియా బుకింగ్, ఫార్మర్ రిజిస్ట్రేషన్ వ్యవసాయేతర మార్కెట్ విలువ సర్వీసుల గురించి మీసేవ నిర్వాహకులకు వివరించారు. కులం, ఆదాయం, నివాసం, జనన, మరణ కుటుంబ ధ్రువీకరణ పత్రం, నేటివిటి, గ్యాప్, నాన్ క్రిమిలేయర్ వంటి సర్టిఫికెట్లు ఎన్నిసార్లు అయినా తీసుకునే వెసులుబాటు ఉందన్నారు. మీసేవ సెంటర్లలో తప్పకుండా సిటిజెన్ చాప్టర్, భూభారతికి సంబంధించిన ఫ్లెక్సీలు, మీసేవ లోగో, తహసీల్దార్, ఈడీఎం, పరిష్కారం కాల్ సెంటర్ల ఫోన్ నంబర్లు తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన నిర్ణీత రుసుము కంటే ఎక్కువ రుసుము దరఖాస్తుదారుడు నుంచి తీసుకుంటే తప్పనిసరిగా ఆ సెంటర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో పౌర సేవలను పారదర్శకంగా వేగవంతంగా అందించేందుకు ప్రభుత్వం నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని వివరించారు. ఇకపై పౌర సేవల దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, రెవెన్యూ సిబ్బంది నివేదికల సమర్పణ తదితర ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్ విధానంలోనే కొనసాగుతుందన్నారు. కాగిత రహిత విధానం అమల్లోకి రావడంతో సమయానికి సేవలు అందడంతో పాటు పారదర్శకత పెరుగుతుందని దేవేందర్ తెలిపారు.


