ఏటూరునాగారం: వెదురు సాగుతో మహిళా లోకానికి కొత్త వెలుగులు నింపుతోంది. తక్కువ పెట్టుబడితో స్థిరమైన ఆదాయాన్ని అందిస్తూ మహిళా సంఘాల సభ్యులను బలోపేతం చేస్తుంది. లక్షల రూపాయల ఆదాయం పొందే ఈ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సంఘాల సభ్యులకు అప్పగించారు. ఒక్కో మండలానికి ఒక్కో వీఓకు అప్పగించారు. మహిళా సంఘంలో సభ్యురాలి అయి ఉండి జాబ్ కార్డు ఉన్న రైతులకు 60 మొక్కలు ఉచితంగా ఇవ్వనున్నారు. మొక్కలు నాటిన మూడేళ్ల నుంచి సదరు రైతులు ఆదాయం పొందవచ్చు. ఈ మేరకు ఏజెన్సీలోని ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం(కె) మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి నర్సరీల పెంచే బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించగా అందులో ఏటూరునాగారం, తాడ్వాయి నుంచి ఇద్దరు సభ్యులు ముందుకు రావడంతో సెర్ప్, ఈజీఎస్ ద్వారా ఒక్క వీఓ సంఘం సభ్యురాలికి 30వేల మొక్కలకు కావాల్సిన విత్తనాలను అందజేశారు. ఈ విత్తనాలను త్రిపుర నుంచి తెప్పించి ప్రత్యేకంగా ఇచ్చారు.
రుణ సదుపాయం
మండల సమాఖ్య ద్వారా బ్యాంకు నుంచి రూ.1.20 లక్షల పెట్టుబడి రుణం అందజేసి సీడ్‌ను సరఫరా చేశారు. 30వేల మొక్కలను మూడు నెలల పాటు పెంచి సెర్ప్, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌కు అప్పగించాల్సి ఉంది. ఒక్కో మొక్కకు రూ.15 చొప్పున ఈజీఎస్ ద్వారా నర్సరీ నిర్వాహకురాలికి చెల్లించి మొక్కలను కొనుగోలు చేస్తారు. అనంతరం ఆ మొక్కలను ఉచితంగా రైతులకు ఇవ్వనున్నారు. ఇలా నర్సరీలు పెంచే మహిళా సంఘం సభ్యులకు ఆర్థిక ఫలాలు పుష్కలంగా రానున్నాయి.
మొదలు కానీ నర్సరీలు
జిల్లాలో ఆరు మండలాలను పైలట్‌గా గుర్తించి నర్సరీల పెంపునకు శిక్షణ ఇచ్చారు. కానీ ఏటూరునాగారం, తాడ్వాయి నుంచి ఇద్దరు మహిళా సభ్యులు మాత్రమే నర్సరీలను పెంచుతున్నారు. మంగపేట, వాజేడు, వెంకటాపురం(కె), కన్నాయిగూడెం మండలాల నుంచి మహిళలు ముందుకు రాకపోవడంతో అక్కడ ఎలాంటి నర్సరీలను ఏర్పాటు చేయలేదు. సెర్ప్, ఈజీఎస్ అధికారులు మహిళా సంఘం సభ్యులకు శిక్షణ ఇచ్చారు కానీ.. సరైన ప్రోత్సాహం ఇవ్వకపోవడంతోనే మిగతా మండలాల సభ్యులు ముందుకు రావడం లేదని సమాచారం. సీడ్ అప్పగించే వరకు వెంటపడి ఆ తర్వాత మాకేమి తేలియదన్నట్లు వ్యవహరించడంతోనే మహిళలు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
పైలట్ ప్రాజెక్టుగా జిల్లాలోని
6 మండలాలు ఎంపిక
మండలానికో నర్సరీ,
అందులో 30వేల మొక్కలు
రైతులకు ఉచితంగా పంపిణీ
మొక్కలను పెంచుతున్న..
మండల సమాఖ్య ద్వారా సీడ్ ఇచ్చారు. వాటిని తీసుకొని 30 వేల మొక్కలను పెంచుతున్న. సీడ్ వారు ఇచ్చిన విత్తనాలను మొక్కలు వచ్చే విధంగా చేయడంతో ఆర్థిక ఫలాలు వస్తాయి. జిల్లాలోని ఆరు మండలాల్లోని ఆరుగురి సభ్యులకు శిక్షణ ఇచ్చారు. ఇప్పటి వరకు మొక్కలు బాగానే ఉన్నాయి.
–మసాని లావణ్య, లక్ష్మీసరస్వతి సంఘం,
ఏటూరునాగారం
రెండు మండలాల్లో మొదలు..
ప్రస్తుతం తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లోని ఒక్కో సభ్యురాలికి 30వేల సీడ్‌ను అందించి నర్సరీలను పెంచుతున్నాం. మిగతా మండలాల నుంచి సభ్యులెవరూ రా లేదు. వస్తే వారికి కూడా కావాల్సి న ఏర్పా ట్లు చేసి నర్సరీల ఏర్పాటునకు కృషి చేస్తాం.
–రాజు, డీపీఎం


