ఏటూరునాగారం: అటవీ హక్కుల పథకం కింద పోడు పట్టాలు పొందిన రైతులకు ఆన్‌లైన్ చేయకపోవడంతో రైతు భరోసా, రైతు బీమా తదితర పథకాలు అందకుండా పోతుంది. బ్యాంకుల్లో రుణాలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ డబ్బులు కూడా రావడం లేదు. 2024 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 3,567 మంది రైతులు పథకాలను కోల్పోతున్నారు. గిరిజన రైతులకు చెందిన ఆధార్ కార్డులు వెరిఫికేషన్ చేసి గిరిజన సంక్షేమశాఖ హైదరాబాద్‌కు సమర్పించాల్సి ఉంది. కానీ ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో రైతు భరోసా పథకం మరుగున పడింది. ఇదేకాకుండా రైతు బీమా కూడా వర్తించకుండా పోతుంది.
ఆన్‌లైన్ కాని పట్టాలు..
రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ నుంచి ఆర్‌ఓఎఫ్‌ఆర్ ఆన్‌లైన్‌లో లాగిన్ ఇచ్చి అర్హులైన రైతుల పట్టాదారు పాసు పుస్తకం (ఆర్‌ఓఎఫ్‌ఆర్)ను ఆన్‌లైన్ చేయించాల్సిన ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయం అధికారులు స్థానికంగా ఉన్న ఐటీడీఏ ఎస్‌డీసీ, ఆర్‌ఓఎఫ్‌ఆర్ విభాగంలోని అధికారులకు లాగిన్ ఇవ్వలేదు. 2024 నుంచి ఇప్పటి వరకు లాగిన్ ఇవ్వకపోవడంతో ఆ పట్టాలు ఆన్‌లైన్ కాలేదు. వరంగల్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా గిరిజన రైతుల భూములున్నాయి. అందులో పోడు పట్టాలున్న రైతులు అధికంగా ఉన్నప్పటికీ ఆన్‌లైన్ చేయకపోవడం మూలంగా పీఎం కిసాన్, రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలు వర్తించకుండా పోవడంతోపాటు ఆర్థికంగా రైతులు నష్టపోతున్నారు.
మూడేళ్లుగా జరగని ఎఫ్‌ఆర్‌సీ కమిటీ
గిరిజన ప్రాంతాల్లో పోడు చేసుకున్న రైతులకు వారి హక్కు కల్పించేందుకు ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్, ఐటీడీఏ ద్వారా ఫారెస్ట్ రైట్ కమిటీని సమావేశ పర్చాల్సి ఉంది. 2024 నుంచి ఇప్పటి వరకు ఎఫ్‌ఆర్సీ కమిటీ సమావేశం ఊసలేదు. ప్రతీ ఏడాదిలో రెండు మార్లు ఈ ఎఫ్‌ఆర్‌సీ కమిటీ సమావేశమై కొత్తగా పోడు ఉన్నాయా, 2006 పూర్వం ఉన్న పోడు ఎన్ని ఎకరాలు, ఎంత మంది రైతులు, వారు నిజమైన గిరిజనులు, అర్హులేనా అనేక అంశాలను కమిటీ కూర్చొని పరిశీలన చేస్తోంది. కానీ కమిటీ సమావేశాలు జరగకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలిపోయింది.
2024 నుంచి అధికారులకు
లాగిన్ ఇవ్వని పరిస్థితి
రైతు భరోసా, తదితర పథకాలకు
దూరమవుతున్న రైతులు
ఉమ్మడి జిల్లాలో 3,567 మంది
గిరిజనులు
మా భూములు ఆన్‌లైన్ చేయాలి
అల్లంవారిఘణపురం సమీపంలోని గుర్రాలబావిలో పట్టా భూములను ఆన్‌లైన్ చేయాలి. మా పేరు మీద పట్టాలు ఉన్నప్పటికీ ఆ భూముల్లోకి గిరిజనులను రానివ్వకుండా గొత్తికోయలు అడ్డుకొని ఇబ్బంది పెడుతున్నారు. మా పేరు మీద పట్టాలున్నా..అధికారులు ఆన్‌లైన్ చేయడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఆన్‌లైన్‌లో మా పేర్లు లేకపోవడంతో ఆర్థికంగా నష్టం జరుగుతుంది.
–ఆర్కే సమ్మయ్య, అల్లంవారిఘణపురం,
ఏటూరునాగారం


