ములుగు రూరల్: ఇసుక రవాణా కోసం రోడ్డు విస్తరణ పనులు నిలిపివేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. ఈ మేరకు శుక్రవారం వెంకటాపురం(కె) మండలానికి చెందిన వీరభద్రాపురం, పాత్రపురం, పాలెం గ్రామాలకు చెందిన రైతులతో కలిసి అదనపు కలెక్టర్ మహేందర్‌జీకి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల పట్టా భూములకు నష్టం కలిగించే పాలెం సాండ్ బేరింగ్ ఏరియా రహదారి విస్తరణను నిలిపివేయాలన్నారు. గోదావరి ఒడ్డుకు ఇసుక రవాణా కోసం 60 అడుగుల వెడల్పుతో రోడ్డు పనులకు రెవెన్యూ అధికారులు సర్వే చేయడంతో రైతులు నష్టపోతున్నారన్నారు. ఈ నెల 11న రెవెన్యూ అధికారులు ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా సర్వేయర్‌తో కలిసి సర్వే చేస్తున్నారని, ఇసుక లారీల కారణంగా పంటలపై దుమ్ముపడి దిగుబడులు తగ్గి నష్టం వాటిల్లుతుందన్నారు. రైతుల హక్కులను కాలరాస్తు ఇసుక మాఫియాకు సహకరిస్తే రైతుల పక్షాన పోరాటాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రవింద్రాచారి, రైతులు సమ్మయ్య, శ్రీను, బాబు, సర్వేశ్వర్‌రావు, రామారావు, గిరిప్రసాద్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


