ఏటూరునాగారం: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్‌లు, అధికారులు సమస్యలపై దృష్టిసారించి పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, సీ్త్ర శిశు సంక్షేమశాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధ్యక్షతన గురువారం నిర్వహించిన అధికారులు, సర్పంచ్‌ల సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో అనేక సమస్యలుంటాయని, వాటిని సకాలంలో గుర్తించి ప్రజల ఇబ్బందులు తొలగించాల్సిన అవసరం మనపై ఉందన్నారు. అటవీ ప్రాంతాల్లో అటవీశాఖ అనుమతులు లేకుండా లింకు రోడ్ల అభివృద్ధికి వివరాలను ఐటీడీఏ పీఓకు అందజేయాలని సర్పంచ్‌లను కోరారు.
‘ఇందిరమ్మ’ నిర్మాణాల్లో వేగం పెంచాలి
ఏజెన్సీ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని, ఆగస్టు 15వ తేదీన ఒంటరి మహిళలకు నూతన పింఛన్ అందించనున్నట్లు సీతక్క తెలిపారు. జాప్యం లేకుండా ఇళ్ల నిర్మాణాల టార్గెట్‌ను పూర్తి చేసుకుంటే మరో 5 వేల ఇళ్లను మంజూరు చేయిస్తానని సీతక్క తెలిపారు. ఒంటరి మహిళలు, ఇతర పింఛన్‌ల విషయంలో ఎంపీడీఓలు కార్యదర్శులతో మాట్లాడి అర్హులైన వారికి పింఛన్ రాకుంటే వివరాలను డీఆర్‌డీఏకు పంపించాలని ఆదేశించారు. అంతేకాకుండా విద్య, వైద్యం పై అధికారులు దృష్టిసారించాలన్నారు. రోగులకు వైద్యులు అందుబాటులో ఉంటూ పాము, తేలు, కాటు మందులను అందుబాటులో పెట్టుకోవాలని ఆదేశించారు. ఐటీడీఏకు రూ.1.50 కోట్లతో నూతన భవనం కోసం స్థలపరిశీలన చేయాలని ఐటీడీఏ ఇంజనీరింగ్ డీఈ ప్రశాంత్‌రెడ్డిని మంత్రి ఆదేశించారు. కరెంటు లేని గ్రామాలను గుర్తించాలని, గిరిజన గూడేలకు సొలార్ వెలుగు రాబోతున్నాయని మంత్రి తెలిపారు. అంగన్‌వాడీ భవనాలు, ప్రభుత్వ పాఠశాలలకు నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని డీఈ పురుషోత్తంను మంత్రి ఆదేశించారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో మహిళా సంఘాల అభివృద్ధి కోసం మహిళా శక్తి క్యాంటిన్లు, స్వయం ఉపాధి కోసం పసుపు, కారం, తదితర పరిశ్రమలను ఏర్పాటు చేసి ఆర్థికంగా ఎదిగేలా చూడాలన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు, సఫాయిలు, సర్పంచ్‌లకు ఒకటో తేదీన వేతనాలు పడుతాయని, ఆ విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ కాకులమర్రి శ్రీలత, డీఎఫ్‌ఓ వికాస్ మీనా, అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు, గ్రంథాలయ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, ఆర్డీఓ కృష్ణవేణి పాల్గొన్నారు.
సర్పంచ్‌లు, అధికారులు
సమస్యలపై దృష్టి పెట్టాలి
ఆగస్టు 15 నుంచి
ఒంటరి మహిళలకు పింఛన్
సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క


