● డీఎంహెచ్‌ఓ గోపాల్ రావు
ములుగు రూరల్: నులి పురుగుల నివారణకు వైద్యారోగ్యశాఖ కృషి చేస్తుందని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు అన్నారు. ఈ మేరకు సోమవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాకేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు ఆల్బెండజోల్ మాత్రలను వేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. నులి పురుగుల కారణంగా పిల్లలు పౌష్టికాహారం తీసుకున్నా రక్తహీనత, శారీరక ఎదుగుదల ఉండదని తెలిపారు. పిల్లలు వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 73,444 మంది పిల్లలు ఉన్నారని తెలిపారు. సోమవారం అనివార్య కారణాలతో పాఠశాలలకు హాజరుకాని విద్యార్థులకు ఈ నెల 20వ తేదీన మాత్రలను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునేషన్ ప్రోగ్రాం అధికారి నాగఅన్వేష్, మాస్ మీడియా అధికారి సంపత్, పాఠశాల ప్రిన్సిపల్ నర్మదాభాయి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ దుర్గారావు, ఆర్‌బీఎస్‌కే వైద్యులు మల్లికార్జున్, శ్రీలత, తదితరులు పాల్గొన్నారు.


