పోలింగ్‌ కేంద్రాల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

Jul 14 2026 1:12 AM | Updated on Jul 14 2026 1:12 AM

కొనసాగుతున్న టీజీసీపీగెట్‌ పరీక్షలు లక్ష్మీనర్సింహ శతకం ఆవిష్కరణ అంబేడ్కర్‌ స్టడీ సెంటర్‌ ఇన్‌చార్జ్‌ జాయింట్‌ డైరెక్టర్‌గా శ్రీనివాస్‌

వెంకటాపురం(ఎం): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల పరిధిలోని లక్ష్మీదేవిపేట, బుర్గుపేట గ్రామాలలో గల పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల నమోదు అధికారి, ఆర్డీఓ కృష్ణవేణి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్యుమరేషన్‌ ఫారాల సేకరణ, యాప్‌లో డిజిటలైజేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత బీఎల్‌ఓలకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ గిరిబాబు, డిప్యూటీ తహసీల్దార్‌ భవాని ప్రసాద్‌, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్‌ నితీష్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

కేయూ క్యాంపస్‌: తెలంగాణలోని తొమ్మిది యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ఈవిద్యాసంవత్సరం 2026–27లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న టీజీసీపీగెట్‌–26 ఆరో రోజు సోమవారం నిర్వహించినట్లు సీపీ గెట్‌ కన్వీనర్‌, కేయూ కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల ప్రొఫెసర్‌ కె.రాజేందర్‌ తెలిపారు. ఉదయం సెషన్‌లో నిర్వహించిన ఎంఏ ఇంగ్లిష్‌ కోర్సుకు 2,942, మధ్యాహ్నం సెషన్‌లో ఎమ్మెస్సీ ఫిజిక్స్‌ కోర్సుకు 902, సాయంత్రం సెషన్‌లో ఎంఈడీ, ఎంఏ లింగ్విస్టిక్స్‌ కోర్సుకు 1,241 మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలిపారు.

విద్యారణ్యపురి: కాకతీయ పద్య కవితా వేదిక ఆధ్వర్యంలో హనుమకొండలో విశ్రాంత తెలుగు భాషోపాధ్యాయులు కవి చంద్ర నర్సింగోజు లక్ష్మయ్య రచించిన శ్రీ లక్ష్మీనర్సింహ శతకం పుస్తకావిష్కరణను సోమవారం నిర్వహించారు. కాకతీయ పద్యకవిత వేదిక అధ్యక్షుడు సమస్యా పృచ్ఛక చక్రవర్తి కందిశంకరయ్య ఈ శతకాన్ని ఆవిష్కరించారు. పద్య కవితా వేదిక బాధ్యులు అన్నావజ్జుల సోంబాబు అధ్యక్షతన జరిగిన ఈ పుస్తకావిష్కరణలో సహృదయ సాంస్కృతిక కార్యదర్శి వనం లక్ష్మీకాంతారావు, విశ్రాంత విద్యాశాఖ అధికారి నన్నపనేని రామేశ్వర్‌రావు, వజ్జల రంగాచార్యులు, శతావధాని చేపూరి శ్రీరామ్‌, డాక్టర్‌ ఎన్‌వీఎన్‌ చారి, కె.రమేశ్‌, జీడికంటి శ్రీనివాసమూర్తి, పల్లేరు వీరస్వామి, అక్కర కరుణాసాగర్‌, గుంటి విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

కేయూ క్యాంపస్‌: కేయూలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్టడీ సెంటర్‌ ఇన్‌చార్జ్‌ జాయింట్‌ డైరెక్టర్‌గా బయోటెక్నాలజీ విభాగం ల్యాబ్‌ అసిస్టెంట్‌ డాక్టర్‌ పుల్లా శ్రీనివాస్‌ను నియమిస్తూ సోమవారం కేయూ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.రామచందం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన కేయూ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీగా, కేయూ టెక్నికల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా, అఖిల భారత విశ్వవిద్యాలయాల ఉద్యోగుల సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. సోమవారం సాయంత్రం ఈ ఉత్తర్వుల కాపీని డాక్టర్‌ పుల్లా శ్రీనివాస్‌కు వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి అందజేశారు. ఓఎస్‌డీ ఆచార్య బి.వెంకట్రామ్‌రెడ్డి, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్‌ మనోహర్‌, కేయూ ఎన్‌ఎస్‌ఎస్‌ కో–ఆర్డినేటర్‌ ఆచార్య ఈసం నారాయణ పాల్గొన్నారు.

ఉచిత శిక్షణకు

దరఖాస్తు గడువు పెంపు

విద్యారణ్యపురి: హైదరాబాద్‌లోని షెడ్యూల్డ్‌ కులాల స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సివిల్‌ సర్వీసెస్‌ (ప్రిలిమినరీ–27) ఉచిత రెసిడెన్షియల్‌ కోచింగ్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునేందుకు ఈనెల 19వరకు గడువు పొడిగించినట్లు ఉమ్మడి వరంగల్‌ జిల్లా షెడ్యూల్డ్‌ కులాల స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.జగన్‌మోహన్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగ అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులై ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఈనెల 19 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 26న హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు హెచ్‌టీటీపీ//టీఎస్‌స్టడీసర్కిల్‌.కో.ఇన్‌లో చూడాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement