ఏటూరునాగారం: గిరిజనులు ఐటీడీఏకు వస్తే ఏ అధికారి.. ఏ హోదాలో పనిచేస్తున్నారనే విషయం తెలిసేలా ఏర్పాటు చేసిన బోర్డులు ఇంకా మారలేదు. ఐటీడీఏలో పలు హోదాల్లో పనిచేసిన అధికారులు బదిలీపై వెళ్లినప్పటికీ వారి పేర్లు ఇంకా దర్శనమిస్తున్నాయి. సార్ లేకున్నా బోర్డు పాతదే ఉండడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. కార్యాలయంలో ఏపీఓ నాగోరావు ఇటీవల బదిలీ కాగా ఆయన పేరును బోర్డుపై నుంచి తొలగించలేదు. ఎస్‌ఓ రాజ్‌కుమార్, డీడీ పోచం బదిలీ కాగా ఈఈ వీరభద్రం పదవీవిరమణ పొందారు. కానీ ఇంకా ఇక్కడే పనిచేస్తునట్లుగా ఈ బోర్డులో ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఐటీడీఏలో కీలక పోస్టులు ఖాళీగా ఉండడంతో పాలన అస్తవ్యస్తంగా మారింది.
దేవునిగుట్టపై వరదపాశం
ములుగు రూరల్: మండల పరిధిలోని కొత్తూరు పంచాయతీ పరిధిలో గల దేవునిగుట్టపై కొలువైన లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో గ్రామస్తులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు శనివారం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారం మేరకు గుట్టపై వరదపాశం కార్యక్రమం ఆలయ కమిటీ చైర్మన్ కిషన్‌రావు ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా కిషన్‌రావు మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రతీ ఏడాది వర్షాకాల ప్రారంభంలో దేవునిగుట్టపై పాయసం తయారు చేసి బండరాళ్లపై పోసి నాలుకతో సేవించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
15 నుంచి
శాకంబరీ ఉత్సవాలు
హన్మకొండ కల్చరల్: శాకంబరీ నవరాత్రోత్సవాలను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ అమ్మవారి అనుగ్రహం పొందాలని భద్రకాళి దేవాలయ ఈఓ, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత అన్నారు. ఆలయ ప్రాంగణంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో రామల సునీత, ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, సిబ్బంది పాల్గొని శాకంబరీ ఉత్సవాల వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం రామల సునీత మాట్లాడుతూ.. ఈ నెల 15 బుధవారం నుంచి జూలై 29 బుధవారం వరకు 15రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు, అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు మాట్లాడుతూ.. ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం అమ్మవారికి ఒక్కో క్రమాలలో పూజలు నిర్వహించనున్నట్లు, జూలై 29న మహా శాకంబరీగా అమ్మవారు దర్శనమిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ముఖ్యార్చకులు చెప్పెల నాగరాజుశర్మ, సిబ్బంది కూచన హరినాఽథ్, అలుగు కృష్ణ, చింత శ్యామ్‌సుందర్ తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న
టీజీసీపీగెట్
కేయూ క్యాంపస్: తెలంగాణలోని తొమ్మిది యూనివర్సిటీల్లో ఈ విద్యాసంవత్సరం 2026–27లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకుగాను తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీసీపీగెట్–26) ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ ప్రవేశ పరీక్షలు శనివారం నాలుగో రోజు కొనసాగాయని కన్వీనర్ కేయూ కామర్స్‌అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల
ప్రొఫెసర్ కె.రాజేందర్ తెలిపారు. ఈ ప్రవేశపరీక్షలో ఉదయం సెషన్‌లో ఎంఏ పొలిటికల్ సైన్స్ కోర్సుకు 2,681 మంది అభ్యర్థులకుగాను 2,323 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. మధ్యాహ్నం సెషన్‌లో ఎంఎల్‌ఐఎస్సీ/బీఎల్‌ఐఎస్సీ కోర్సుకుగాను 736 మంది అభ్యర్థులకుగాను 600 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సాయంత్రం సెషన్‌లో నిర్వహించిన జియోగ్రఫీ ప్రవేశపరీక్షకు 165 మంది అభ్యర్థులకుగాను 145 మంది అభ్యర్థులు హాజరైనట్లు రాజేందర్ తెలిపారు.


