వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని గురువారం తైవాన్ దేశానికి చెందిన అగ్రికల్చర్ రీసెర్చర్ బోయాన్ లిన్ సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని ఆయన దర్శించుకోగా పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని బోయాన్ లిన్ కొనియాడారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించి సరస్సు అందాలను తిలకించారు.
మెనూ ప్రకారం భోజనం
అందించాలి
కన్నాయిగూడెం: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం వనసతులు, నాన్యమైన విద్యను అందించాలని ఐటీడీఏ డీడీ ఫిరంగి అన్నారు. మండల కేంద్రంలోని ఐలాపూర్‌లో ఉన్న గిరిజన ఆశ్రమ వసతి గృహాన్ని ఐటీడీఏ డీడీ ఫిరంగి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడారు. పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం నుంచి అందిస్తున్న వసతులు, విద్యాబోధనపై ఆరా తీశారు. విద్యార్థులకు శుద్ధ జలం అందించాలని ఏర్పాటు చేసిన నీటి శుద్ధజలాన్ని పరిశీలించారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో విద్యార్థులకు సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వసతులను మెనూ ప్రకారం ఇవ్వాలన్నారు. అనుమతి లేకుండా విఽధులకు గైర్హాజరైతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఓసీ–3లో తప్పిన ప్రమాదం
గణపురం: గణపురం మండలం పరుశరాంపల్లి శివారులోని ఓసీ–3లో గురువారం పెను ప్రమాదం తప్పింది. ఓసీ–3లో బాంబ్ బ్లాస్టింగ్ కార్మికులు ఉన్నప్పుడే అధికారులు హెచ్చరిక లేకుండా వేరే వ్యక్తులతో బాంబ్ బ్లాస్టింగ్ చేశారు. కార్మికుల కథనం ప్రకారం.. ఓపెన్ కాస్టు గనిలో 82 మంది బాంబ్‌బ్లాస్టింగ్ కార్మికులుగా పని చేస్తున్నారు. రోజు 56మంది వచ్చి విధుల్లో పాల్గొంటారు. ఈ క్రమంలో ప్రతీ నెల తమకు 26 రోజులు మస్టర్లు వేయాలని కార్మికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు వారం రోజుల గడువు పెట్టారు. ఇది బుధవారానికి ముగిసింది. దీంతో గురువారం పనులు అడ్డుకోవడానికి బ్లాస్టింగ్ రెగ్యులర్ కార్మికులు రాగా అప్పటికే నూతన వ్యక్తులను తీసుకొచ్చిన అధికారులు హెచ్చరిక లేకుండానే గనిలో బాంబ్ బ్లాస్లింగ్ చేయించారు. దీంతో కార్మికులు చెల్లా చెదురయ్యారు. ఓసీ–3 మేనేజర్ కావాలనే బ్లాస్టింగ్ చేశారని ఆందోళనకు దిగారు. ఓసీ–3లో కార్మికులు ఉండగానే బాంబ్ బ్లాస్టింగ్ చేయడం తప్పేనని ఇన్‌చార్జ్ ఓసీ–3 మేనేజర్ శ్యాంసుందర్ అన్నారు. ఈ ఘటన అనుకోకుండా జరిగిందన్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు తాము, పోలీసు సిబ్బంది కూడా అక్కడే ఉన్నామన్నారు. ఈ ఘటనపై విచారణ చేస్తామని చెప్పారు.
14న జాబ్ మేళా
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 14న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమణారావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాల ప్లేస్‌మెంట్ అండ్ కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో ఈ జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జువెలరీ రంగంలో ప్రముఖ సంస్థ అయిన జోయాలుక్కాస్‌కు చెందిన వివిధ శాఖల్లో ఉన్న 300లకు పైగా ఖాళీల భర్తీ కోసం ఈ నియామక ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగిన ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యా, ఇతర సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 10 గంటలకు కళాశాలలో హాజరు కావాలని సూచించారు. ఎంపికై న అభ్యర్థులకు నెలకు సుమారు రూ.23వేల వేతనంతో పాటు ఇతర ప్రోత్సాహకాలు అందజేయనున్నట్లు తెలిపారు.
అప్రెంటిస్‌షిప్ మేళా..
ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్ మేళాను ఈ నెల 13న స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ జుమ్లానాయక్ పేర్కొన్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు అప్రెంటిషిప్.ఇండియా వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.


