ములుగు: తక్కువ నీటితో సాగు చేసే ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలని, ఈ నెల 15 తర్వాత జలాశయాల నీటి నిల్వల ఆధారంగా పంటలపై రైతులకు మార్గదర్శకాలు జారీ చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి గురువారం వ్యవసాయం, సాగునీరు, వర్షపాతం, ఎల్‌నినో ప్రభావం, నివారణ చర్యలపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 15శాతం లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. గతేడాదితో పోలిస్తే నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయని, ఇప్పటివరకు ఎగువ రాష్ట్రాల నుంచి నీటి ప్రవాహం రావడం లేదన్నారు. మంత్రులు నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు మాట్లాడుతూ వాతావరణం, వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజాప్రతినిధులు రైతులకు సమాచారం అందించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సంబంధిత అధికారులతో జిల్లాలోని నీటి లభ్యత, పంటల సాగు పరిస్థితులను సమీక్షించారు.
వీసీలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి


