చకచకా పనులు | - | Sakshi
Sakshi News home page

చకచకా పనులు

Jul 9 2026 6:53 AM | Updated on Jul 9 2026 6:53 AM

ద్వారం దిమ్మైపె ఏర్పాటు చేయని కొమ్ము దిమ్మెలు

ఎస్‌ఎస్‌తాడ్వాయి: జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి త్వరలోనే పర్యటించనున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మేడారం ఆలయ పునరుద్ధరణ పనులు చకచకా సాగుతున్నాయి. రూ. 100 కోట్లతో గద్దెల ప్రాంగణం పునరుద్ధరణ పనులను చేపట్టగా జాతర సమమంలో కొంత మేరకు పనులను కాంట్రాక్టర్‌ పూర్తి చేశారు. అనంతరం పనులను మళ్లీ చేపట్టారు. త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటనకు రానుండడంతో నిర్ణీత గడువులోగా పనులన్నీ పూర్తిచేయాలనే లక్ష్యంతో సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు ముమ్మరం చేశారు. ఇటీవల మంత్రి సీతక్క జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పనుల పురోగతిపై జాప్యం చేయొద్దని గడువులోగా పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు పనుల్లో వేగాన్ని మరింత పెంచారు.

కొనసాగుతున్న పనులు..

గద్దెల ప్రాంగణంలో గ్రౌండింగ్‌ పనులు చివరి దశకు చేరుకున్నాయి. వర్షపు నీరు నిల్వ లేకుండా డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచేలా ఆలయం చుట్టూ ఉన్న ద్వారాలపై ఏర్పాటు చేసిన దిమ్మాలపై చెక్కిన కొమ్ములు, బొమ్మల ఏర్పాటు పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం 8 ద్వారాలకు గాను రెండు ద్వారాలపై కొమ్ములతో చెక్కిన రాతి స్తంభాలను ఏర్పాటు చేశారు. ఇంకా ఆరు ద్వారాల దిమ్మెలపైన రాతి బొమ్మల స్తంభాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రాంగణం సుందరీకరణ, విద్యుత్‌, వసతుల కల్పన పనులను చేపడుతున్నారు. మంత్రి సీతక్క సమీక్ష అనంతరం పనుల పురోగతిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.

రోజువారీగా పర్యవేక్షణ

అవసరమైన చోట అదనపు సిబ్బందిని నియమించడంతో పాటు యంత్రాల సంఖ్యను పెంచి పనులను యుద్ధప్రాతిపదికన కొనసాగిస్తున్నారు. ప్రతీ పనికి గడువు నిర్ణయించారు. రోజువారీగా పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. పనుల నాణ్యతలో రాజీ పడకుండా నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా సంబంధిత శాఖల మధ్య సమన్వయం పెంచారు. సీఎం పర్యటనకు ముందే ఆలయ పునరుద్ధరణ పనులను పూర్తిచేసి, భక్తులకు మెరుగైన వసతులు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులను దశలవారీగా నిర్వహిస్తున్నారు. మిగిలిన పనులు సైతం నిర్ణీత గడువులోగా పూర్తవుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సీఎం పర్యటన నాటికి పూర్తి చేసేలా

అధికారుల కసరత్తు

జోరుగా మేడారం ఆలయ పునరుద్ధరణ పనులు

మంత్రి సీతక్క ఆదేశాలతో పుంజుకున్న వేగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement