ములుగు: గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధుల సహకారంతో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై కలెక్టర్ బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు 98.96 శాతం ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి కాగా 25.79 శాతం ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని వెల్లడించారు. ఫారాల పంపిణీ, వివరాలు నింపే ప్రక్రియలో, తిరిగి ఫారాలను స్వీకరించడంలో బీఎల్‌వోలకు రాజకీయ పార్టీల బీఎల్‌ఏలు సహకరించాలని సూచించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో సమస్యలు ఎదురైతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. బీఎల్‌వోలు ప్రతీ ఇంటిని సందర్శిస్తూ ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తున్నారని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా 24న పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరు జాబితా కీలకమైందని వివరించారు. అర్హులైన ఓటర్ల పేరు జాబితాలో నమోదు అయ్యేలా, అనర్హుల పేర్లు తొలగించేలా రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు, బీఎల్‌వోలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదాంను గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నెలవారి తనిఖీ చేసి గోదాం సీల్‌ను పరిశీలించారు. గోదాంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, అగ్నిప్రమాదాల నివారణకు ఏర్పాటు చేసిన ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, ఇతర భద్రతా పరికరాలను తనిఖీ చేశారు. అత్యవసర పరిస్థితులు తలెత్తిన సందర్భంలో అనుసరించాల్సిన భద్రతా చర్యలపై సంబంధిత సిబ్బందికి సూచనలు చేశారు. గోదాం వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు, సందర్శకుల నమోదు పుస్తకాలను పరిశీలించారు. ఈవీఎంల భద్రత విషయంలో అలసత్వం వహించొద్దని సిబ్బందిని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, ఆర్డీఓ కృష్ణవేణి, ఎన్నికల సూపరింటెండెంట్ సలీం, డీటీ నితీష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు


