ములుగు: గ్రామ పంచాయతీలను ఆర్థికంగా, పరిపాలనాపరంగా బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ నుంచి గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అమలు, 16వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం, గ్రామాల్లో అభివృద్ది కార్యక్రమాలపై మంత్రి సీతక్క రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి అదనపు కలెక్టర్ సంపత్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గ్రామస్థాయిలో ఖర్చు చేసే ప్రతీ రూపాయి ప్రజల అభ్యున్నతికే ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని ఆదేశించారు. 16వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై ప్రతీ సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యదర్శికి పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని సూచించారు. నేటి నుంచి జిల్లాల వారీగా మూడు రోజుల పాటు సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులకు సమగ్ర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి తెలిపారు. వీబీజీరామ్‌జీ చట్టంపై ప్రతీ సర్పంచ్, కార్యదర్శికి పూర్తిస్థాయి అవగాహన కల్పించాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్ధాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ వెంకయ్య, మిషన్ భగీరథ ఎస్‌ఈ చల్లారెడ్డి, ఈఈ సురేందర్, పంచాయతీరాజ్ ఈఈ అజయ్ కుమార్, మిషన్ భగీరథ డీఈ సునీత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
వీసీలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క


