అంకితభావంతో విధులు నిర్వర్తించాలి | - | Sakshi
Sakshi News home page

అంకితభావంతో విధులు నిర్వర్తించాలి

Jul 7 2026 1:07 AM | Updated on Jul 7 2026 1:07 AM

ములుగు రూరల్‌: పోలీసులు అంకితభావంతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సిబ్బందికి రెయిన్‌ కోట్లు అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ వర్షాకాలంలో విధులకు ఆటంకం కలగకుండా పోలీసులు విధులు నిర్వహించే విధంగా రెయిన్‌ కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. విధి నిర్వహణలో ఆటంకాలు ఎదురైతే ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు. అవసరమైతే నేరుగా తనను కలువచ్చని తెలిపారు. కింది స్థాయి సిబ్బందికి అండగా ఉంటామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ సదానందం, ఆర్‌ఐ స్వామి, సిబ్బంది పాల్గొన్నారు.

పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల అందజేత

జిల్లా కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న 15 మంది బాధితులకు సోమవారం ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ తిరిగి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్ల సిబ్బంది మిస్సింగ్‌ మొబైల్స్‌ రికవరీపై వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదులపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రజలు తమ వ్యక్తిగత వస్తువులపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఫోన్లు కోల్పోయిన వారు వెంటనే సీఈఐఆర్‌ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేసి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

ఆర్థిక అక్షరాస్యతపై

అవగాహన

వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని నల్లగుంటలో సోమవారం వరంగల్‌ డీసీసీ బ్యాంక్‌ ములుగు శాఖ, వెంకటాపూర్‌ పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై సోమవారం అవగాహన కల్పించినట్లు బ్రాంచ్‌ ఫీల్ట్‌ ఆఫీసర్‌ కార్తీక్‌రెడ్డి తెలిపారు. ప్రజలకు బ్యాంక్‌ ఖాతా, పొదుపు, ఫిక్సిడ్‌ డిపాజిట్‌ ప్రాముఖ్యత, పీఎంజేజేబీవై(ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన), పీఎంఎస్‌బీవై(ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన), కేవైసీ, రీకేవైసీ, అలాగే బ్యాంకు ద్వారా అందిస్తున్న వివిధ రకాల రుణ సౌకర్యాల గురించి వివరంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ సిబ్బంది యాట లింగయ్య, రమేశ్‌, కోటి తదితరులు పాల్గొన్నారు.

ఎన్యుమరేషన్‌ ఫారాలు పంపిణీ చేయాలి

ములుగు: ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ నేటి వరకు వందశాతం పూర్తి చేసి డిజిటలైజేషన్‌ ప్రక్రియలో వేగం పెంచాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌ రెడ్డి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన సోమవారం హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఎస్‌ఐఆర్‌ కార్యక్రమం పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు జిల్లా నుంచి కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు వీసీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ దాదాపుగా పూర్తయిందని తెలిపారు. ఇళ్లకు వెళ్లిన సమయంలో తాళం వేసి ఉంటే వాటిని అబ్సెంట్‌గా నమోదు చేయాలన్నారు. అవసరమైతే తర్వాత మరోసారి సందర్శించి ఫారాలను అందజేయాలని సూచించారు. పంపిణీ చేసిన ప్రతి ఎన్యుమరేషన్‌ ఫారాన్ని బూత్‌ లెవల్‌ అధికారులు తిరిగి సేకరించి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా డిజిటలైజేషన్‌ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. ఆనంతరం కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు మాట్లాడుతూ జిల్లాలో ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ 98 శాతం పూర్తయిందని తెలిపారు. నేటి(మంగళవారం) వరకు 100శాతం పూర్తి చేస్తామని వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు 13.88 శాతం ఎన్యుమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ పూర్తయిందని తెలిపారు. ఫారాల పంపిణీ పూర్తవుతున్న నేపథ్యంలో డిజిటలైజేషన్‌ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement