● డీఈఓ సిద్ధార్థరెడ్డి
ములుగు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖాధికారి సిద్ధార్థరెడ్డి తెలిపారు. ఈ నెల 1న సమస్యల్లో సర్కారు స్కూళ్లు శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన డీఈఓ శనివారం సాక్షికి ఓ ప్రకటన విడుదల చేశారు. మంగపేట మండలంలోని శనిగకుంట ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకున్న మాట వాస్తవమేనని తెలిపారు. విద్యార్థుల బోధన అభ్యాస కార్యక్రమాలకు అంతరాయం కలగకుండా జీఐ షీట్లతో నిర్మించిన షెడ్‌లో తరగతి గదులు కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే డిప్యుటేషన్‌పై ఉపాధ్యాయుడిని నియమించినట్లు తెలిపారు. వెంకటాపురం(కె) మండలంలోని రంగరాజుపురం పాఠశాలలో మూడు తరగతి గదులు ఉండగా అందులో ఒక తరగతి గది వర్షానికి కురుస్తుందన్నారు. మన ఊరు, మన బడి పథకంలో రెండు తరగతి గదులు నూతనంగా ప్రారంభించినప్పటికీ నిర్మాణం పూర్తి కాలేదన్నారు. వర్షానికి కురుస్తున్న తరగతి గదిలో విద్యార్థులను కూర్చోపెట్టవద్దని హెచ్‌ఎంను ఆదేశించినట్లు తెలిపారు. కన్నాయిగూడెం మండలంలోని కొత్తూరు పాఠశాల భవనం సురక్షితంగా లేదని గుర్తించి విద్యార్థులను సురక్షితమైన తరగతి గదులకు తరలించాల్సిందిగా హెచ్‌ఎంను ఆదేశించినట్లు డీఈఓ తెలిపారు.


