ములుగు రూరల్: సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రవికాంత్, సంజీవరావులు అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం సీపీఎస్ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 28న సీపీఎస్ ఉద్యోగుల జనజాగరణ యాత్ర జిల్లా కేంద్రానికి చేరుకుంటుందని ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు బర్మావత్ శ్రీను, నాయకులు వీరస్వామి, సూరయ్య, వినాయక్, ప్రతాప్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
మీసేవలో మరో కొత్త సర్వీస్
ములుగు: రాష్ట్ర ప్రభుత్వం మీ సేవలో మరో కొత్త సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ఎస్‌ఎస్‌సీ మార్కుల మెమోను కోల్పోయిన లేదా పోగొట్టుకున్న విద్యార్థులు ఇకపై తమ ఈ మెమోను మీసేవ కేంద్రాల ద్వారా సులభంగా పొందవచ్చని వెల్లడించారు. ఈఎస్‌డీ మీసేవ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు 2004 నుంచి ఎస్‌ఎస్‌సీ పరీక్షల ఈ మెమోలను మీసేవ ద్వారా ప్రింట్ తీసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందని వివరించారు. దరఖాస్తుదారులు తమ ఎస్‌ఎస్‌సీ హాల్ టికెట్ నంబర్, పరీక్ష పూర్తయిన సంవత్సరం వివరాలను అందజేస్తే, వెంటనే మీసేవ స్టేషనరీపై అధికారిక ఎస్‌ఎస్‌సీ ఈ మెమో ప్రింట్ అందజేస్తారని తెలిపారు. ఇందుకోసం రూ.62 సేవా రుసుము చెల్లించాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు.
రామప్పలో ఇంగ్లాండ్ దేశస్తులు
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఇంగ్లాండ్‌కు చెందిన జోనాతన్, బ్రే ఆమంద దంపతులు శనివారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు.
చట్టాలపై అవగాహన ఉండాలి
ములుగు రూరల్: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ మేకల మహేందర్ అన్నారు. ఈ మేరకు మల్లంపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాహక్కు, ర్యాగింగ్, బాల్య వివాహల నిరోధక చట్టం, మోటార్ వెహికల్ చట్టం పై అవగాహ కలిగి ఉండాలన్నారు. ఉచిత న్యాయ సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 15100కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలుగు చంద్రయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నత్తనడకన బ్రిడ్జి పనులు
ఏటూరునాగారం: మండల పరిధిలోని కొండాయి–దొడ్ల గ్రామాల మధ్యలోని బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జవహర్ అన్నారు. మండల కేంద్రంలోని బీజేపీ మండల అధ్యక్షుడు వినుకోలు చక్రవర్తి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దొడ్ల–కొండాయి బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయని తెలిపారు. గతంలో కొండాయికి వరద వచ్చినప్పుడు అన్యాయంగా ఏడుగురు మరణించారని పేర్కొన్నారు. అప్పుడు కన్నీటిదారలు కార్చిన మంత్రి సీతక్క మరి ఇప్పటి వరకు ఎందుకు పనులు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. గత కొన్ని రోజుల కిందట తాత్కాలికంగా ఇసుక బస్తాలు వేసి చేతులు దులుపుకున్నారన్నారు. ఎలిశెట్టిపల్లి గ్రామానికి వెళ్లేందుకు జంపన్నవాగు ఉండడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు.


