ములుగు రూరల్: రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఇటుక బట్టీలు, ఫ్యాక్టరీలు, హోటళ్లు, బైక్ మెకానిల్ వద్ద బాల్యాన్ని తాకట్టు పెడుతున్న అభాగ్యులకు ‘ఆపరేషన్ ముస్కాన్’ కొత్త జీవితాన్ని ప్రసాదిస్తోంది. బాల కార్మికులను కాపాడేందుకు ప్రభుత్వం 2014 నుంచి ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం చేపడుతుంది. ప్రతీ ఏటా జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్, జూలై 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఆపరేషన్ ముస్కాన్ పేరుతో కార్యక్రమాలు చేపడుతున్నారు. మహిళా శిశు సంక్షేమశాఖ, పోలీస్ శాఖ, చైల్డ్ హెల్ప్ లైన్ ఆధ్వర్యంలో కార్యక్రమాలను చేపడుతున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడుతూ 18 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన పిల్లలను, చదువు మానేసి కార్మికులుగా మారిన వారి వివరాలు సేకరించి అదుపులోకి తీసుకుంటున్నారు. అదుపులోకి తీసుకున్న బాల కార్మికుల పరిస్థితులను బట్టి వారికి అందుబాటులో ఉండే పాఠశాలల్లో అడ్మిషన్లు ఇప్పించి చదువు చెప్పిస్తున్నారు.
920 మంది చిన్నారులకు విముక్తి
జిల్లాలోని పది మండలాల్లో ప్రతీ ఏడాది జనవరి, జూలై నెలల్లో ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను అధికారులు 2014 నుంచి నిర్వహిస్తున్నారు. జిల్లా ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 920 మంది బాల కార్మికులను గుర్తించి పాఠశాలల్లో చేర్పించారు. బాలల రక్షణ కమిటీల ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో బాల కార్మికులను పనిలో పెట్టుకోవడం చట్టరీత్య నేరమని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులపై లేబర్ యాక్ట్ కింద కేసులు నమో దు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఇటుక బ ట్టీలు, క్రషర్‌లలో పనుల నిమిత్తం వచ్చిన కార్మి కుల పిల్లలను అందుబాటులో ఉన్న పాఠశాలల్లో చే ర్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. బాల కార్మికులను గుర్తించిన, బడీడు పిల్లలను బడిలో చే ర్పించకుండా ఉన్న పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో పాటు పాఠశాలకు పంపించేందుకు అంగీకార పత్రాలను రాయిస్తున్నారు.
పాఠశాలలో చేర్పించాం..
జిల్లాలోని పది మండలాల్లో దాడులు నిర్వహించి గుర్తించిన బాల కార్మికులను పాఠశాలల్లో చేర్పించాం. అలాగే బాల కార్మికుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాం. 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్య నేరం. లేబర్ యాక్టు ప్రకారం యజమానులు శిక్ష అర్హులు అవుతారు. ప్రతీ సంవత్సరం జనవరి, జూలై మాసాల్లో ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు జిల్లాలోని ప్రతిఒక్కరూ సహకరించాలి.
–ఈపీ ప్రేమలత,
జిల్లా సంక్షేమశాఖ అధికారి
ఫలిస్తున్న ‘ఆపరేషన్ ముస్కాన్’
ప్రతీ ఏటా జనవరి, జూలైలో
అధికారుల తనిఖీలు
2019 నుంచి ఇప్పటివరకు
920 చిన్నారులకు విముక్తి
ప్రారంభమైన ‘జూలై’ ఆపరేషన్


