ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండలంలోని నార్లాపూర్ గ్రా మపంచాయతీ పరిధిలోని తక్కళ్లపాడు గొత్తికోయ గూడెంలో ప్రాథమిక పాఠశాల లేకపోవడంతో విద్యార్థులు సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలోని నార్లపూర్ ప్రాథమిక పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. రవాణా సౌకర్యం లేక పలువురు విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడటంతో ఉపాధ్యాయులు సొంత నిధులతో ఆటో రవాణా సౌకర్యాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. పాఠశాల హెచ్‌ఎం కొర్నెబెల్లి నారాయణరావు చొరవతో కాంప్లెక్స్ హెచ్‌ఎం విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఎంఈఓ గడ్డి శ్రీనివాస్ సహకారంతో నెలనెలా ఆటో అద్దెను భరించాలని నిర్ణయించారు. దీంతో తక్కళ్లపాడు గూడెంలోని గొత్తికోయ విద్యార్థులు ఇకపై ఆటోలో పాఠశాలకు రాకపోకలు సాగించనున్నారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ ఎంఈఓ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఉపాధ్యాయులే స్వచ్ఛందంగా రవాణా సౌకర్యం కల్పిస్తున్నారన్నారు. ఈ అవకాశాన్ని గూడెం వాసులు సద్వినియోగం చేసుకొని పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపాలని కోరారు. విద్యార్థుల కోసం చొరవ చూపిన హెచ్‌ఎం నారాయణరావును ఆయన అభినందించారు.


