ములుగు రూరల్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప ఆలయానికి ఓపెన్ కాస్ట్‌తో ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని రామప్ప ఆలయ పరిరక్షణ కమిటీ కన్వీనర్ అక్కిరెడ్డి రామ్మోహన్‌రావు తెలిపారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రామప్ప ఆలయం ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిందన్నారు. ఆలయ ప్రతిష్ట ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉందని తెలిపారు. ఓపెన్ కాస్ట్ పనులు చేపడితే ఆలయ అస్తిత్వం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఓపెన్ కాస్ట్ పనులను నిలిపి వేసి రామప్ప ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత జిల్లా వాసులపై ఉందని వివరించారు. ఆర్కియాలజీ అధికారులు రామప్ప ఆలయ పరిధిలోని నందీశ్వరుడిపై నీడ ఏర్పాటు చేయాలన్నారు. ఓపెన్ కాస్ట్ పనులపై ఆర్కియాలజీ అధికారులు సర్వే నిర్వహించి ఆలయాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.
రామప్ప ఆలయ పరిరక్షణ కమిటీ కన్వీనర్ రామ్మోహన్‌రావు


