వెంకటాపురం(కె): గోదావరి ముంపు ప్రాంత ఆదివాసీలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూనెం రామచందర్ అన్నారు. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని కోయ బెస్తగూడెం, తుర్సవానిగూడెం, టేకుల బోరు గ్రామాల ఆదివాసీలకు చెందిన ఇళ్లు ప్రతీ ఏడాది గోదావరి వరదలకు ముంపునకు గురవుతున్నాయని తెలిపారు. తక్షణమే అధికారులు స్పందించి గిరిజనులకు ఇంటి స్థలాలు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాంప్రసాద్, సాయిచరణ్, నవీన్, రాజబాబు, సురేంద్ర, నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు.
44 పాఠశాలల అభివృద్ధి పనులకు టెండర్లు
ములుగు: జిల్లాలోని 44 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల అభివృద్ధి పనులకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ సిద్దార్థరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతీ పాఠశాలకు రూ.1 లక్ష చొప్పున బాలా ఫీచర్స్, చైల్డ్ ఫ్రెండ్లీ ఫర్నీచర్, అవుట్‌డోర్ ప్లే మెటీరియల్, విద్యార్థులకు అవసరమైన షూస్, బెల్ట్, స్కూల్ బ్యాగులు, యూనిఫాంలతో పాటు భవనాల మైనర్ రిపేర్లు, పెయింటింగ్ పనులు చేపపట్టేందుకు అర్హత కలిగిన రిజిస్టర్డ్ సంస్థల నుంచి సీల్డ్ టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. టెండర్ ఫారాలు జూలై 3 నుంచి 6 వరకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో లభిస్తాయని, ఫారం పొందేందుకు రూ.10వేలు డిమాండ్ డ్రాఫ్ట్‌ను సమర్పించాల్సి ఉంటుందని వివరించారు. పూర్తి వివరాలతో టెండర్లు ఈనెల 8వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. జూలై 10న కలెక్టరేట్‌లో టెండర్లు ఓపెన్ చేయనున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాలకు కో–ఆర్డినేటర్ శ్యామ్ సుందర్ రెడ్డిని ఫోన్ నంబర్ 7981956839లో సంప్రదించవచ్చని తెలిపారు.
క్యాబిన్‌లో ఇరుక్కున్న టిప్పర్ డ్రైవర్
ఏటూరునాగారం: మండలంలోని చిన్నబోయినపల్లి వద్ద ఇసుక లారీ ఢీకొని ఒకరు మరణించి 24 గంటలు కాకముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం వరంగల్ నుంచి ఏటూరునాగారం వైపు వస్తున్న ఇసుక టిప్పర్ లారీ మరో లారీని ఢీకొనగా.. ఆ లారీ ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొంది. దీంతో ఇసుక టిప్పర్ లారీ క్యాబిన్ నుజ్జునుజ్జు అయ్యి డ్రైవర్ అందులో ఇరుక్కుపోయాడు. అయితే, డ్రైవర్ వివరాలు తెలియాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ చిటమట రఘు సంఘటనా స్థలానికి చేరుకొని క్యాబిన్‌లో ఇరుకున్న వ్యక్తిని జేసీబీ సాయంతో బయటకు తీశారు. ఈ సంఘటనతో సుమారు 5 కిలోమీటర్ల మేర ఇసుక లారీలు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై నుంచి టిప్పర్‌ను బయటకు తీయడానికి సుమారు రెండు గంటల సమయం పట్టిందని రఘు తెలిపారు.
92 శాతం బొగ్గు ఉత్పత్తి
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని కాకతీయ గనుల్లో జూన్ మాసంలో సంస్థ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి, రవాణా 92శాతం సాధించినట్లు ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గడిచిన మాసంలో 2.35లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యం చేయాల్సి ఉండగా 2.15లక్షల ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. రోజు వారిగా సుమారు 7,181 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి రవాణా చేసినట్లు చెప్పారు. రెండు ఓపెన్ కాస్టు గనుల్లో 121శాతం మట్టి వెలికితీత పనులు చేపట్టినట్లు వివరించారు. జూలై మాసంలో 3.67లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్ విధించినట్లు తెలిపారు. కార్మికులు సమష్ఠి కృషి చేసి ఉత్పత్తి సామర్‌ాధ్యన్ని పెంచాలని కోరారు.
దరఖాస్తుల ఆహ్వానం
భూపాలపల్లి రూరల్: టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్ కం మెయిన్స్) ఉద్యోగాలకు 10 నెలలు ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి కుమారి సుకీర్తి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలని సూచించారు.


