పకడ్బందీగా ఓటరు జాబితా సవరణ | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ఓటరు జాబితా సవరణ

Jul 2 2026 2:29 AM | Updated on Jul 2 2026 2:29 AM

ములుగు: జిల్లాలో చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని, నిర్ధేశించిన సమయం మేరకు పూర్తి చేయడంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో బుధవారం కలెక్టర్‌ విలేకరులతో మాట్లాడారు. జూన్‌ 25 నుంచి జూలై 24 వరకు బూత్‌ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు గణన ఫారాలు పంపిణీ చేస్తూ వివరాల సేకరణ ప్రక్రియను చేపడుతున్నారని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 2,36,970 మంది ఓటర్లు ఉండగా ఇప్పటివరకు దాదాపు 96 శాతం గణన ఫారాల పంపిణీ పూర్తి అయిందని తెలిపారు. ప్రస్తుతం ఓటర్లు ఫారాలను నింపడంతో పాటు వాటి సేకరణ ప్రక్రియ కూడా కొనసాగుతోందని తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేక సవరణ కార్యక్రమంలోని ప్రతీ దశలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రతీ బుధవారం జిల్లా స్థాయిలో కలెక్టరేట్‌లో, రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో ఆర్డీఓ కార్యాలయాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి కార్యక్రమ పురోగతిపై వివరాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఈనెల 24 లోపు పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేసి, 31న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురిస్తామని తెలిపారు. ఈనెల 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, దరఖాస్తుల స్వీకరణ కొనసాగించి, సెప్టెంబర్‌ 28 లోపు వాటి పరిష్కారం పూర్తి చేసి అక్టోబర్‌ 1న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ప్రజలు, రాజకీయ పార్టీలు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు.

బీఎల్‌ఓల ద్వారానే గణన ఫారాల పంపిణీ

ఓటరు గణన ఫారాల పంపిణీ బూత్‌ లెవల్‌ అధికారులు మాత్రమే పంపిణీ చేయాలని, రాజకీయ పార్టీలకు చెందిన బూత్‌ స్థాయి ఏజెంట్లు ఫారాలు పంపిణీ చేయరాదని కలెక్టర్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు బీఎల్‌ఓలతో సమన్వయం చేసుకుంటూ ప్రక్రియ సక్రమంగా జరుగుతుందా లేదా అని పరీశీలించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు ఆర్డీఓ కృష్ణవేణి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్‌ కుషీల్‌ వంశీ, ఏఈఆర్‌ఓ తహసీల్దార్‌ విజయభాస్కర్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

జిల్లా ఎన్నికల అధికారి,

కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement