మంగపేట: మండలంలోని హేమాచల లక్ష్మీనర్సింహాస్వామి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన హుండీ లెక్కింపు ద్వారా రూ.9,22,224 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఇన్‌చార్జ్ కార్యనిర్వాహణ అధికా రి ఎం.వీరస్వామి తెలిపారు. 2026 మార్చి 20న ఏర్పాటు చేసిన 9 హుండీలతో పాటు ఏప్రిల్ 27 నుంచి ఈనెల 6వ తేదీ వరకు జరిగిన స్వామివారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల (జాతర) సందర్భంగా స్వామివారి ప్రధాన ఆలయం ముందు, వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన 6 హుండీల్లో స్వామివా రికి భక్తులు సమర్పించిన కానుకలను స్వామివారి కల్యాణ మండపంలో కురవి దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో లెక్కింపు నిర్వహించారు. 15 హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.9,22,224ల ఆదాయం సమకూరిందన్నారు. కొంత బంగారం, వెండి మిశ్రమ వస్తువులు, రెండు అమెరికన్ డాలర్లు రాగా వాటిని ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీలో భద్రపరిచినట్లు ఈఓ తెలిపారు.
కోడెల వేలం ఆదాయం రూ.53,500
బ్రహ్మోత్సవాల్లో పలువురు భక్తులు స్వామివారికి మొక్కుగా చెల్లించిన రెండు కోడెలు, ఆవు దూడలను ఆలయ ఈఓ వీరస్వామి పర్యవేక్షణలో బహిరంగ వేలం పాట నిర్వహించగా మల్లూరు గ్రామానికి చెందిన పలువురు రూ.53,500లకు వేలం ద్వారా కోడెలను దక్కించుకున్నట్లు ఈఓ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ పూజారులు శేఖర్‌శర్మ, పవన్‌కుమార్, రాజీవ్ నాగఫణిశర్మ ఈశ్వర్‌చంద్ శర్మ, ఆలయ సీనియర్ అసిస్టెంట్ సీతారామయ్య, రికార్డు అసిస్టెంట్ గోనె లక్ష్మినారాయణ, శేషు, పాల్వంచ, కొత్తగూడెం, మణుగూరుకు చెందిన శ్రీవారి సేవా బృందం సభ్యులు పాల్గొన్నారు.


