
రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్
వెంకటాపురం(ఎం): రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్‌గా ఉందని అమెరికాకు చెందిన చాడ్విక్ కాలిన్స్ కొనియాడారు. గురువారం మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని కాలిన్స్ సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. టూరిజం గైడ్ తాడబోయిన వెంకటేష్ ఆలయ విశిష్టతను వివరించారు. ఇదిలా ఉండగా.. రామలింగేశ్వరస్వామి గురువారం చంద్రమౌళీశ్వరస్వామిగా పర్యాటకులు, భక్తులకు దర్శనమిచ్చినట్లు ఆలయ ప్రధాన పూజారి కోమల్లపల్లి హరీశ్‌శర్మ తెలిపారు. భక్తులు, పర్యాటకులు స్వామివారికి అర్చన, అభిషేకం నిర్వహించినట్లు వెల్లడించారు.
ములుగు రూరల్: జిల్లా అగ్నిమాపక కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న తాళ్ల నగేష్ రాష్ట్రపతి అవార్డుకు ఎంపికయ్యారు. 1987లో ఉద్యోగంలో చేరిన నగేష్ వరంగల్, మహబూబాబాద్, ములుగు అగ్నిమాపక కేంద్రాల్లో విధులు నిర్వర్తించారు. వరంగల్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురై సమయంలో ప్రయాణికులను రక్షించడంలో సహసోపేతంగా వ్యవహరించారు. దీంతోపాటు వరదల సమయంలో ప్రజలను కాపాడారు. వరంగల్‌లో పత్తి, పసుపు గోదాములు అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు ఉత్తమ సేవలు అందించారు. మహబూబాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పడిపోయిన వారిని కాపాడారు. ములుగు జిల్లాలో బావిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన మహిళను కాపాడి ప్రశంసలు పొందారు. తన ఉత్తమ సేవలకు గాను ఇప్పటి వరకు నాలుగు ప్రశంసా పత్రాలు, ఒక సేవా పథకం అందుకున్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి సేవా పతకానికి ఎంపికవడంతో పలువురు నగష్‌ను అభినందించారు.
ఏటూరునాగారం: ఆశ్రమ పాఠశాలలో ప్రభుత్వం నిబంధనల ప్రకారం మెనూ పాటించాలని ఐటీడీఏ ఏపీఓ వసంతరావు అన్నారు. మండల కేంద్రంలోని ఏటూరునాగారం, మండంలోని చిన్నబోయినపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వంట గది, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు తయారు చేసిన వంటలను రుచి చూసి మరింత రుచికరంగా వంట చేయాలని ఆదేశించారు. రాబోయే టెన్త్ వార్షిక పరీక్షల్లో విద్యార్థులు నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలని, అందుకు విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో పాఠాలను బోధించాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆయన వెంట హాస్టల్ వార్డెన్లు మనోజ్‌కుమార్, అధికారులు ఉన్నారు.

రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్