
వర్షాలతో నష్టం వాటిల్లకుండా చూడాలి
ములుగు రూరల్: భారీ వర్షాల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, సీఎస్ రామకృష్ణారావుతో కలిసి ఆయన గురువారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. జిల్లా నుంచి కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ సంపత్‌రావు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. వరద సహాయక చర్యల నిమిత్తం జిల్లాకు రూ.కోటి చొప్పున ప్రభుత్వం విడుదల చేసిందని మంత్రులు తెలిపారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రజలకు పరిహారం అందించేందుకు ప్రతిపాదనలు పంపాలని పేర్కొన్నారు. సహాయక చర్యల్లో పోలీస్ శాఖ సహకారం తీసుకోవాలని తెలిపారు. రోడ్లు, కావేజ్‌లు, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులను వెంటనే చేపట్టాలని అన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సిబ్బందికి సెలవులు ఇవ్వకూడదని సెలవులపై వెళ్లిన వారిని రప్పించాలని తెలిపారు. ఎస్టీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను వినియోగించుకోవాలని అన్నారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న వాగులు, చెరువుల సమీపంలో రోడ్లు, కల్వర్టులను, వంతెనలను మూసి వేయాలని మంత్రులు తెలిపారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ.. జిల్లాలో మంగళవారం 49 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైందని, వెంకటాపురం(కె), మంగపేట మండలాల్లో అత్యధికంగా వర్షం కురిసినట్లు తెలిపారు. కమలాపురం కాలనీలో నీరు రావడంతో 45 నిమిషాల సమయంలో నీరును తొలగించామని అన్నారు. జిల్లా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్ సీఈ కుమారస్వామి, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి సురేష్‌కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో సహాయక చర్యలకు
రూ.కోటి మంజూరు