
ఇక్కడే ఉంటారా... సురక్షిత ప్రాంతాలకు వెళ్తారా..
ఏటూరునాగారం: జంపన్నవాగు ఉధృతి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్తారా... లేక ఇక్కడే ఉంటారా.. అని అడిషనల్ కలెక్టర్ మహేందర్‌జీ కొండాయి గ్రామస్తులను అడిగారు. గురువారం ఆయ న అధికారులతో కలిసి కొండాయి గ్రామాన్ని సందర్శించారు. పడవలో ప్రయాణించి జంపన్నవాగు దాటి గ్రామానికి చేరుకున్న ఆయన ప్రజలతో మాట్లాడారు. గ్రామస్తులకు ప్రభుత్వం ఇళ్లు, ఇంటి స్థలాలు ఇచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తోందని, గ్రామస్తులు అభిప్రాయం చెప్పకపోవడంతో అది పెండింగ్‌లో ఉందని తెలిపారు. ముంపుప్రాంతాల వారికి దొడ్ల ప్రాంతంలోని 16 ఎకరాల రెవెన్యూ భూమి ఇవ్వడం జరుగుతుందని, అందుకు కావాల్సిన ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామస్తులంతా ఏకాభిప్రాయానికి వచ్చి తమకు లేఖలను అందించాలని కోరారు. కొండాయిలో ఉన్న స్థితిగతులు, ప్రజల ఇబ్బందులను మాజీ సర్పంచ్ కాక వెంకటేశ్వర్లు అడిషనల్ కలెక్టర్‌కు వివరించారు. ఇదిలా ఉండగా.. కొండాయి గ్రామస్తులకు దొడ్ల వద్ద ఎలాంటి భూమి ఇవ్వొద్దని దొడ్ల గ్రామస్తులు అడిషనల్ కలెక్టర్ కారును అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. మా ఊరిలోని కొన్ని ఇళ్లు కూడా మునిగిపోయాయని, వాళ్లకు కూడా దొడ్లలో పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలని కోరారు. అదేకాకుండా గోవిందరాజుల కాలనీ వద్ద ఉన్న అటవీశాఖకు చెందిన భూమి కావడంతో దానిని స్వాధీనం చేసుకొని ఇళ్లకు పంపిణీ చేయడం కుదరదని ప్రజలకు వివరించినట్లు సమాచారం.
అప్రమత్తంగా ఉండాలి
వర్షాలు ముగిసే వరకు లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ కలెక్టర్ మహేందర్‌జీ అన్నారు. దొడ్ల, కొత్తూరు, మల్యాల, కొండాయి ప్రజలకు వర్షాలు, వరదలపై అవగాహన కల్పించారు. ఎలాంటి అవసరం ఉన్నా పడవలో వెళ్లాలని, నిత్యావసర వస్తువులతోపాటు వైద్య సేవలు అందిస్తామన్నారు. ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని తహసీల్దార్ జగదీశ్వర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిటమట రఘు, చేల నవీన్, గ్రామస్తులు, అధికారులు, పంచాయతీ కార్యదర్శి సతీష్ ఉన్నారు.
అడిషనల్ కలెక్టర్‌ను అడ్డుకున్న
దొడ్ల గ్రామస్తులు
ముంపు ప్రాంతాల్లో పర్యటించిన
అడిషనల్ కలెక్టర్ మహేందర్‌జీ