
పొడిగించేనా..?
నేటితో ముగియనున్న పీఏసీఎస్‌ల పాలకవర్గాల గడువు
వెంకటాపురం(ఎం): ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్)కు సర్కార్ పొడిగించిన ఆరు నెలల పదవీ కాలం గడువు నేటితో (గురువారం) ముగియనుంది. మరో ఆరు నెలలు పొడిగిస్తారా.. లేదా అనే విషయమై ఇప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. పీఏసీఎస్‌లకు 2020 ఫిబ్రవరి 15న ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరి 16న చైర్మన్లను ఎన్నుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16తో ఐదేళ్ల పదవీ కాలం ముగిసింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా ఆరు నెలల పదవీ కాలాన్ని పొడిగించింది. పొడిగించిన పదవీ కాలం గురువారంతో ముగియనున్నప్పటికీ ఇప్పటివరకు పాలకవర్గాల కొనసాగింపుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో అటు అధికారులు, ఇటు పాలకవర్గ సభ్యుల్లో ఉత్కంఠ నెలకొంది. మరో ఆరు నెలల గడువు పొడిగించాలా లేదా పాలకవర్గాలను రద్దు చేసి పీఏసీఎస్, డీసీసీబీ చైర్మన్లను నామినేటెడ్ పద్ధతిలో నియమించాలా అనే విషయమై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో పీఏసీఎస్ పాలకవర్గాల గడువు మరో ఆరు నెలలు పొడగించాలని పీఏసీఎస్ చైర్మన్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో 99 పీఎసీఎస్‌లు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 99 పీఏసీఎస్ సంఘాలు ఉండగా 2.5 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వరంగల్ పరిధిలో 28, హనుమకొండ పరిధిలో 16, జనగామలో 14, మహబూబాబాద్ పరిధిలో 19, ములుగు పరిధిలో 12, జయశంకర్ భూపాలపల్లి పరిధిలో 10 పీఏసీఎస్ సంఘాలు ఉన్నాయి. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను ఏర్పాటు చేసింది. పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు పంట రుణాలు, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు అందుతున్నాయి. అంతేకాకుండా పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేసి రైతాంగానికి ప్రభుత్వ మద్దతు ధర అందేలా చూస్తున్నారు. ప్రతీ ఐదేళ్లకోసారి పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా పాలకవర్గాలను నియమిస్తారు. ప్రతీ సొసైటీకి సీఈఓతో పాటు చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు ఉంటారు. పాలకవర్గాల గడువు గురువారంతో ముగియనుండడంతో ప్రత్యేక పాలన విఽధిస్తారా.. మరో ఆరు నెలలు పొడిగిస్తారా అనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
మరో ఆరు నెలలు
పొడిగించాలంటున్న పాలకవర్గాలు
ప్రత్యేక పాలననా..
నామినేటెడ్‌తో భర్తీనా..?
ప్రభుత్వ ఆదేశాల కోసం ఉత్కంఠ
నామినేటెడ్ పద్ధతిలో..
ప్రాథమిక సహకర సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పద్ధతి అమలు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందని తెలుస్తోంది. గత ఎన్నికల ముందు పార్టీ కోసం కష్టపడిన నాయకులకు, కార్యకర్తలకు అండగా నిలిచి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాదిరిగానే సహకార సంఘాల్లోనూ నామినేటెడ్ పద్ధతిలో పాలకవర్గాన్ని నియమించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. 2020లో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పీఏసీఎస్ ఎన్నికల పాలకవర్గాన్ని రద్దు చేసి ప్రత్యేక అధికారులను నియమించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన వెంటనే నామినేటెడ్ పద్ధతిలో పీఏసీఎస్‌లకు పాలకవర్గాన్ని భర్తీ చేయనున్నట్లు తెలిసింది.
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు
పీఏసీఎస్ పాలకవర్గాల గడువు గురువారంతో ముగియనుంది. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే వరకు ప్రస్తుత పాలకవర్గం కొనసాగుతుంది. గురువారం లోగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.
– సర్దార్‌సింగ్, డీసీఓ

పొడిగించేనా..?