
విద్యావనరుల కేంద్రంలోకి వరదనీరు
మంగపేట: మండల కేంద్రంలోని విద్యావనరుల కేంద్రం భవనంలోకి వరద నీరు వచ్చి చేరడంతో కార్యాలయ సిబ్బంది కస్తూర్బా విద్యాలయంలో బుధవారం విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండలంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మండల కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. మండల కేంద్రంలోని కోమటిపల్లి క్రాస్ రోడ్డు నుంచి గంపోనిగూడెం తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు, బూర్గంపాడు ప్రధాన రోడ్డుపై గల ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద లోతట్టు ప్రాంతంలోని విద్యావనరుల కేంద్రం భవనంలోకి చేరింది. దీంతో కార్యాలయంలో విధులు నిర్వర్తించే అవకాశం లేక పోవడంతో సిబ్బంది తాత్కాలికంగా కస్తూర్బా విద్యాలయంలో కొనసాగించారు. ప్రతీసారి సమస్య ఎదురవుతున్నా అధికారులు సమస్యను పరిష్కరించడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు.