
తునికాకు బోనస్‌లో అవకతవకలు
ఏటూరునాగారం: మండలంలోని అటవీశాఖ కార్యాలయంలో తునికాకు బోనస్‌లో కూలీలకు డబ్బులు రాకుండా అవకతవకలు జరిగాయని సాక్షి ముందుగానే హెచ్చరించింది. ఇందులో అటవీశాఖ రేంజ్ అధికారి బాలరాజు శిక్షను అనుభవించారు. అదే విధంగా ఏటూరునాగారం సౌత్ రేంజ్ అటవీశాఖ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న బందెల రాము అక్రమాలకు పాల్పడినట్లు అధికారుల తనిఖీల్లో నిర్ధారణ అయినట్లు తెలిసింది. ఆపరేటర్ తన భార్య బందెల స్వాతి, తల్లి సారమ్మ ఖాతాల్లో అక్రమంగా పెద్ద మొత్తంలో డబ్బులు జమ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. భార్య బ్యాంకు ఖాతాలో రూ. 4 లక్షలు, తల్లి బ్యాంకు ఖాతాలో రూ. 2.89 లక్షలు అక్రమంగా జమ చేసి జేబులు నింపుకున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని ఈ ఏడాది మార్చిలో తునికాకు బోనస్‌లో చేతివాటం అంటూ సాక్షిలో కథనం ప్రచురితమైంది. అందులో ఓ కంప్యూటర్ ఆపరేటర్ తన బంధువుల పేరుపై లక్షలాది రూపాయలు ఖాతాల్లో జమ చేసుకొని అక్రమాలకు పాల్పడినట్లు కూడా వెల్లడైంది. కానీ అధికారుల అలసత్వం వల్ల ఐదు నెలల తర్వాత ఆ విషయం తేటతెల్లమైందని స్థానికుల్లో చర్చ సాగుతోంది. తునికాకు బోనస్ విషయంలో పెద్ద పెద్ద వాళ్ల చేతివాటం ఉన్నట్లుగా తెలుస్తోంది. కానీ ఆ విషయంపై సీబీఐ విచారణ చేపడితే సుమారుగా రూ. 5 కోట్ల మేర అక్రమార్కుల జేబుల్లోకి డబ్బులు వెళ్లినట్లు తేలుతుందని తునికాకు కూలీలు చెబుతున్నారు. 2023 నుంచి ఇప్పటి వరకు వచ్చిన తునికాకు బోనస్ డబ్బులు వారి ఇష్టారాజ్యంగా ఖాతాల్లో వేసుకున్నారని, తునికాకు బోనస్‌ను ఎవరూ పర్యవేక్షించకపోవడంతో అటవీశాఖలో పెద్ద ఎత్తున కుంభకోణం చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
కంప్యూటర్ ఆపరేటర్ భార్య,
తల్లి పేరుతో రూ.లక్షలు స్వాహా
ముందే చెప్పిన సాక్షి

తునికాకు బోనస్‌లో అవకతవకలు