అమ్మ ఒట్టేయించుకుంది

Yash KGF Chapter 2 Teaser Creates Records - Sakshi

నువ్వు ఎలా బతుకుతావో నాకు తెలీదు. కానీ చచ్చిపోయేటప్పుడు మాత్రం.. ఒక రాజులాగా, పెద్ద శ్రీమంతుడివై చచ్చిపోవాలి. ‘‘మాటివ్వు.. రాఖీ!’’అమ్మ ఒట్టేయించుకుంది

‘అలాగే అమ్మా..’ అన్నట్లు చూస్తాడు పీరియాడిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ కె.జి.ఎఫ్‌. చాప్టర్‌ 1లో హీరో రాఖీ (యశ్‌).రెండేళ్లయింది ఆ సినిమా వచ్చి. కన్నడ చిత్రం. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లోకి డబ్‌ అయింది. డబ్బాల కొద్దీ డబ్బు. 80 కోట్లు ఖర్చుపెట్టి తీస్తే 250 కోట్లు వచ్చాయి. సిల్వర్‌ స్క్రీన్‌ని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ని (కె.జి.ఎఫ్‌.) తవ్వినట్లుగా తవ్వుకున్నాడు నిర్మాత. 

హీరో యశ్‌కి అంతకన్నా ఎక్కువే లభించింది. ఫ్యాన్స్‌! ఫ్యాన్స్‌ ఉన్నవాడే నిజమైన సూపర్‌ స్టార్, మెగాస్టార్‌. రోరింగ్‌ స్టార్‌. యశ్‌ ‘రాకింగ్‌ స్టార్‌’ అయ్యాడు. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్న 35 ఏళ్ల నవీన్‌ కుమార్‌ గౌడ (యశ్‌) కె.జి.ఎఫ్‌. కన్నా ముందు పందొమ్మిది సినిమాల్లో కనిపించాడు. 2018 లో వచ్చిన కె.జి.ఎఫ్‌. 1 అతడి ఇరవయ్యవ సినిమా. అందులో కంటెంట్‌ ఉంది. ఆ కంటెంటే అతడిని సరికొత్త హీరోగా నిలబెట్టింది. చాప్టర్‌ 1 తర్వాత ఇప్పుడు చాప్టర్‌ 2. అక్టోబర్‌లోనే రిలీజ్‌ కావలసింది. కరోనాతో బ్రేక్‌ పడింది. త్వరలోనే థియేటర్స్‌కి రాబోతోంది. టీజర్‌ జనవరి 7న యశ్‌ బర్త్‌డేకి ఒకరోజు ముందు రిలీజ్‌ అయింది. 48 గంటల్లో యూట్యూబ్‌లో 10 కోట్ల వ్యూస్‌! యశ్‌కి ఎలాగుందో గానీ, ఫ్యాన్స్‌ కరోడ్‌పతుల్లా ఫీల్‌ అయ్యారు. రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడొచ్చాడు మరి హీరో. రెగ్యులర్‌ హీరోలు, హీరోయిన్‌లు ఇంకా ఉన్నారు ఈ సినిమాలో. సంజయ్ దత్‌, ప్రకాశ్‌రాజ్, రావు రమేశ్‌, రవీనా టాండన్, శ్రీనిధీ శెట్టీ, మాళవికా అవినాశ్‌. కథలో వీళ్లంతా యశ్‌ చుట్టూ అల్లబడినవారు. యశ్‌ అమ్మ చుట్టూ అల్లుకున్నవాడు. అందుకే కె.జి.ఎఫ్‌..2 టీజర్‌ అమ్మతో మొదలైంది. 

ఎ ప్రామిస్‌ వాజ్‌ వన్స్‌ మేడ్‌.. అని మొదలౌతుంది. అమ్మ తీసుకున్న ప్రమాణం. ‘‘నువ్వు ఎలా బతుకుతావో నాకు తెలీదు. కానీ చచ్చిపోటప్పుడు మాత్రం.. ఒక రాజులాగా, పెద్ద శ్రీమంతుడివై చచ్చిపోవాలి. మాటివ్వు.. రాఖీ!’’. 
∙∙ 
‘హిస్టరీ టెల్స్‌ అజ్‌ ది పవర్‌ఫుర్‌ పీపుల్‌ కమ్‌ ఫ్రమ్‌ పవర్‌ఫుల్‌ ప్లేసెస్‌. హిస్టరీ వాజ్‌ రాంగ్‌. పవర్‌ఫుల్‌ పీపుల్‌ మేక్‌  ప్లేసెస్‌ పవర్‌ఫుల్‌’. టీజర్‌లో.. పవర్‌ఫుల్‌ వాయిస్‌ ఓవర్‌. స్థానబలిమి బాహుబలిని చేస్తుందని చరిత్ర చెబుతుంది. చరిత్ర చెప్పింది తప్పు.బాహుబలులే స్థానానికి బలిమిని తెస్తారు.. అనే గొంతొకటి టీజర్‌ వెనుక నుంచి యశ్‌ ఎంతటివాడో చెబుతూ ఉంటుంది.కె.జి.ఎఫ్‌. సీక్వెన్స్‌లకీ, వాటి చిత్రీకరణలకు రాజమౌళి భారీ ప్రాజెక్టు బాహుబలితో పీరియడ్‌ డ్రామా యాక్షన్‌ పోలికలు తెచ్చాలా టీజర్‌లో కొన్ని షాట్స్‌ కంటి నిండుగా కనిపిస్తున్నాయి.  

యశ్‌కు ఇన్ని లక్షల ఫాలోవర్స్‌ ఉన్నారు కదా.. యశ్‌ పర్సనల్‌గా రాజమౌళి ఫాలోవర్‌! కెజిఎఫ్‌ పార్ట్‌ 1 ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో యశ్‌ స్టేజీ మీద మాట్లాడుతూ ఒక కథ చెప్పారు. ఒక రైతు ఉంటాడు. తన పొలంలో మొక్క జొన్న పండిస్తుంటాడు. మేలు రకం పంట అది. విరగబడి కాస్తుంటుంది. ప్రతి సంవత్సరం ఆయనకే ఉత్తమ రైతు అవార్డు వస్తుంటుంది. మీడియా వాళ్లు ఆయన్ని ఇంటర్వ్యూ చెయ్యడానికి ఆయన ఉన్న పొలం దగ్గరికి వెళ్తారు. ‘‘మీ విజయ రహస్యం ఏమిటి?’’ అని అడుగుతారు. ‘‘నా పంట విత్తనాలను నా ఇరుగు పొరుగు పొలం రైతులకు ఇస్తుంటాను’’ అంటాడు ఆ రైతు. ‘‘అది విజయ రహస్యం ఎలా అవుతుంది? మీరిచ్చిన విత్తనాలతో అంతా మేలు రకం పంటనే పండిస్తారు కదా. అప్పుడు మీ ప్రత్యేక ఏముంటుంది?’’అని ఆశ్చర్యంగా అడుగుతారు. అప్పుడు ఆ రైతు.. ‘‘వాళ్లు నాసిరకం విత్తనాలు వేస్తే పక్షులు వాటిని తీసుకొచ్చి నా పొలంలో వేస్తాయి. అప్పుడు నా పంట కూడా నాసిరకంగా వస్తుంది. అలా రాకుండా ఉండేందుకు వారికి నేను నా విత్తనాలు ఇస్తున్నాను’’ అని చెప్తాడు. ‘‘మరి మీకు పోటీ అవరా మీ పొరుగు రైతులు’’ అని మీడియా వాళ్లు అడుగుతారు. ‘‘పోటీ అనుకోను. అందరూ బాగా పండిస్తే మంచిదే కదా..’’ అని ఆ రైతు అంటాడు. 

యశ్‌ ఈ కథను చెబుతూ.. ‘‘రాజమౌళి గారి గురించే ఆ కథ చెప్పాను. పొరుగు రైతులతో విత్తనాలు పంచుకునే ఆ రైతు రాజమౌళి గారే. ఇండస్ట్రీలో తన ప్రతిభను ఆయన మాలాంటి వాళ్లందరికీ పంచుతున్నారు’’ అన్నారు! కె.జి.ఎఫ్‌. చాప్టర్‌ 2 టీజర్‌ రిలీజ్‌ అయి, రికార్డు స్థాయిలో వ్యూస్‌ రాగానే.. ‘కె.జి.ఎఫ్‌’ మరో ‘బాహుబలి’ అవుతుందా అని రివ్యూలు వచ్చాయి. కొన్ని వెబ్‌ సైట్‌లయితే ‘బాహుబలిని మించిపోతుందా?’ అని కూడా రాశాయి. నిజంగానే మించిపోతే యశ్‌ కన్నా రాజమౌళే ఎక్కువ సంతోషిస్తారేమో. ‘మొక్కజొన్న రైతు’ కదా ఆయన.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top