AR Rahman: అర్హత లేని సినిమాలు ఆస్కార్‌కు.. ఏం చేయలేం.. రెహమాన్‌ సంచలన వ్యాఖ్యలు

Why Did AR Rahman Says That Wrong Movies Are Being Sent For Oscars - Sakshi

ఇన్నాళ్లకు తెలుగు చిత్రపరిశ్రమకు అందని ద్రాక్షలా ఉన్న ఆస్కార్‌ను అమాంతం పట్టుకొచ్చేశాడు కీరవాణి. రాజమౌళి దర్శకత్వం వహించిన రౌద్రం.. రణం.. రుధిరం.. (ఆర్‌ఆర్‌ఆర్‌) సినిమాలోని నాటు నాటు సాంగ్‌ ఉత్తమ ఒరిజినల్‌ పాటగా అకాడమీ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే! అయితే ఈ సినిమాను కూడా నామినేషన్‌కు పంపిస్తారనుకుంటే గుజరాతీ చిత్రం చెల్లో షోను ఆస్కార్‌ నామినేషన్స్‌కు పంపించారు. కానీ అది ఫైనల్‌ నామినేషన్స్‌ లిస్టులో చోటు దక్కించుకోలేకపోయింది. దీనిపై చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్కార్‌ను సాధించే సత్తా ఉన్న ఆర్‌ఆర్‌ఆర్‌ను పంపించి ఉండాల్సిందని పలువురూ అభిప్రాయపడ్డారు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు, రెండుసార్లు ఆస్కార్‌ అందుకున్న ఏఆర్‌ రెహమాన్‌ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

తన యూట్యూబ్‌ ఛానల్‌లో మ్యూజిక్‌ లెజెండ్‌ ఎల్‌ సుబ్రహ్మణ్యంతో మాటామంతీ నిర్వహించాడు రెహమాన్‌. వీరిద్దరూ సంగీతం గురించి, మారుతున్న టెక్నాలజీ గురించి చర్చించారు. ఇంతలో రెహమాన్‌ మాట్లాడుతూ.. 'కొన్నిసార్లు మన సినిమాలు ఆస్కార్‌ వరకు వెళ్లి నిరాశతో వెనక్కు వస్తున్నాయి. అర్హత లేని సినిమాలను ఆస్కార్‌కు పంపుతున్నారనిపిస్తుంది. కానీ జస్ట్‌ చూస్తూ ఉండటం తప్ప మనం ఏం చేయలేం' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అర్హత ఉన్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను ఆస్కార్‌కు పంపించకపోవడం గురించే ఆయన ఇన్‌డైరెక్ట్‌గా ఈ వ్యాఖ్యలు చేశాడంటున్నారు నెటిజన్లు. (చదవండి: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top