
భారత సినీ పరిశ్రమలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా 'రామాయణ'.. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ఏకంగా రూ. 4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీకి నితేశ్ తివారీ దర్శకుడు. ఇందులో రాముడిగా బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. రాకింగ్ స్టార్ యశ్ నిర్మాణ సంస్థ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ మూవీ టీమ్ మాట్లాడుతూ సీతగా సాయిపల్లవిని ఎందుకు ఎంపిక చేశారో పేర్కొంది.
సీతా దేవి పాత్ర కోసం చాలామందిని అనుకున్నాం. కానీ, సాయిపల్లవిని ఫైనల్ చేయడానికి తమకు చాలా కారణాలు ఉన్నాయిని రామాయణ చిత్ర యూనిట్ పేర్కొంది. ఆమె గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండటమే కాకుండా తన అందం కోసం ఆమె ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదని తెలిపింది. సహజ అందమే తమ సినిమాకు బాగుంటుందని అనుకున్నామని, అలా ఒక సందేశం ఇచ్చినట్లు ఉంటుందని టీమ్ రామాయణ ప్రకటించింది. సాయి పల్లవి మంచి నటి కూడా.. ఎలాంటి పాత్రనైనా సులువుగా చేయగలదు. సీత పాత్ర తనకు ఎంతో పేరు తప్పకుండా తెస్తుందని వారు తెలిపారు.
రాముడిగా రణ్‌బీర్‌ను తీసుకోవడానికి కారణం ఆయన మొఖంలో చాలా ప్రశాంతత కనిపిస్తుందని చెప్పారు. తనలోని వ్యక్తిత్వమే కాకుండా గొప్పగా నటించే నైపుణ్యం తనలో ఉందని మేకర్స్ చెప్పారు. ఈ మూవీ మొదటి పార్ట్ 2026 దీపావళికి, రెండోది 2027 దీపావళికి విడుదల కానున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ హిట్ సినిమా'లార్డ్ ఆఫ్ ది రింగ్స్'కు పనిచేసిన స్టంట్ డైరెక్టర్ టెర్రీ ‘రామాయణ’ ప్రాజెక్ట్లో భాగమయ్యారని మేకర్స్ ప్రకటించారు. వానరసేన, హనుమాన్‌లతో కనిపించే సన్నివేశాలకు సంబంధించి ఆయన క్రియేట్ చేసిన ప్రపంచానికి అందరూ ఫిదా అవుతారని తెలిపారు. 'ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్'లో ఏ విధంగానైతే వీఎఫ్‌ఎక్స్ పనితీరు ఉంటుందో అదే విధంగా రామాయణ చిత్రంలోని వానరసేన అంతే సహజంగా ఉంటుందని టీమ్ తెలిపింది.