అది సినిమానే కాదు.. 'ధురంధర్ 2'పై వెట్రిమారన్ షాకింగ్ కామెంట్స్! | Vetrimaaran Takes Indirect Dig At Dhurandhar 2 | Sakshi
Sakshi News home page

‘హింస’తో వందల కోట్లు.. ధురంధర్‌పై వెట్రిమారన్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

Mar 28 2026 6:30 PM | Updated on Mar 28 2026 7:45 PM

Vetrimaaran Takes Indirect Dig At Dhurandhar 2

ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ ఇప్పుడు ఇండియన్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తుంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, రికార్డును సృష్టించింది. ప్రతి ఒక్కరు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. అయితే తాజాగా ప్రముఖ దర్శకుడు, నిర్మాత వెట్రిమారన్‌ మాత్రం ఈ మూవీపై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశాడు. హింసను ప్రేరేపించేలా సినిమాను తీసి వందల కోట్లు సంపాదిస్తున్నారంటూ మండిపడ్డారు. అంతేకాదు చరిత్రను వక్రీకరించడానికి, ప్రజల ఆలోచనలను ప్రభావితం చేయడానికి సినిమాలను వాడుకుంటున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.

శ్రీలంక సివిల్‌ వార్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న'నీలిర' సినిమా ట్రైలర్ రిలీజ్‌ ఈవెంట్‌లో వెట్రిమారన్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘మనం మన కథలను చెప్పుకునేంత వరకు, మన శత్రువులు చెప్పిందే మన జీవితం. మన సొంత కథలను చెప్పుకోవడానికి మనకు ప్రజాస్వామ్యం లేదు. ఈ చిత్రం ద్వేషాన్ని ప్రొత్సహించదు. హింసను సమర్థించదు. వందల కోట్లు సంపాదించాలనే ఆశతో కొంతమంది హింసను ప్రేరేపించేలా సినిమాలను నిర్మిస్తున్నారు. కానీ ఈ చిత్రం ఒక జాతిని, ఒక మతాన్ని కానీ  అపహాస్యం చేసేలా తెరకెక్కలేదు’ అన్నారు. 

ఇంకా మాట్లాడుతూ..‘ఈ రోజుల్లో ప్రతీది  ఒక ప్రచారంగా మారిపోయింది. మన జ్ఞాపకాలను, ఆలోచనలను ప్రభావితం చేసే శక్తి ఈ ప్రచారానికి ఉంది. నోట్ల రద్దు వల్ల ఎవరు నష్టపోయారో, క్యూ లైన్లలో నిలబడి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు వాటన్నింటినీ మరుగున పడేసి, ద్వేషాన్ని పెంచేలా ప్రచారం చేస్తున్నారు. అది సినిమానే కాదు. చరిత్రను లేదా వాస్తవాలను వక్రీకరించి చూపడం ‘హేట్ ప్రొపగండా’కిందకే వస్తుంది’అని  వెంట్రిమారన్‌ విమర్శించాడు.

కాగా, ధురంధర్‌ 2 చిత్రంలో 2016లో మోదీ ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించారు. పాకిస్తాన్ నుంచి వచ్చే దొంగ నోట్లను అరికట్టడానికే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చూపించారు. వాస్తవం ఏంటో తెలియదు కానీ.. నోట్ల రద్దు కారణంగా దేశంలో చిన్న వ్యాపారాలు అన్ని మూతబడ్డాయి. కొంతమంది  డబ్బుల కోసం బ్యాంకు వద్ద క్యూ లైన్‌లో నిలబడి ప్రాణాలను పోగొట్టుకున్నారు.  రైతులు తమ పంటను అమ్ముకోలేక, విత్తనాలు కొనలేక తీవ్రంగా నష్టపోయారు. 

అయితే ఇదే విష‌యాన్ని వెట్రిమార‌న్ ప్ర‌స్తావిస్తూ.. సినిమాల్లో నోట్ల రద్దును ఒక గొప్ప విజయంగా చూపిస్తున్నప్పుడు, పైన పేర్కొన్న సామాన్యుల కష్టాలను ఆ సమయంలో జరిగిన ప్రాణనష్టాన్ని విస్మరించడం ‘ప్రొపగండా’ అవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వెంట్రిమారన్‌ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ధురంధర్‌ 2 గురించే ఆయన మాట్లాడారంటూ నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement