టైటిల్: వీరభద్రుడు
నటీనటులు: సూర్య, త్రిష, ఇంద్రన్స్, నట్టి, ఆర్.జే బాలాజీ తదితరులు
నిర్మాణ సంస్థ: డ్రీమ్ వారియర్ పిక్చర్స్
నిర్మాతలు: ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు
రచన & దర్శకత్వం: ఆర్.జే బాలాజీ
సినిమాటోగ్రఫీ : జికె విష్ణు
సంగీతం : సాయి అభ్యంకర్
ఎడిటర్ : ఆర్.కళైవానన్
విడుదల తేది: మే 15, 2026
సూర్య ఖాతాలో హిట్ పడి చాలా కాలమైంది. ఇటీవల ఆయన నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇప్పుడు ఆయన ఆశలన్నీ కరుప్పు పైనే పెట్టుకున్నాడు. తెలుగులో ‘వీరభద్రుడు’పేరుతో నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
మీను అనే అమ్మాయి ప్రాణాంతక వ్యాధి బారిన పడుతుంది. చికిత్స కోసం లక్షల రూపాయలు కావాల్సి వస్తుంది. దీంతో తమ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలను అమ్మాలని చెన్నై నుంచి హైదరాబాద్‌కు వస్తారు. నాంపల్లిలో రైలు దిగి..సికింద్రాబాద్ వెళ్లేందుకు ఆటో ఎక్కుతుండగా..దొంగలు వచ్చి ఆ నగలను ఎత్తుకెళ్తారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. మరుసటి రోజు దొంగలను పట్టుకొని బంగారాన్ని స్వాధీనం చేసుకుంటారు. వాటిని తీసుకోవాలంటే కోర్టు అనుమతి అవసరం అని చెప్పడంతో మీను, ఆమె తండ్రి కోర్టుకు వెళ్తారు.
ఈ కేసునే టేకాప్ చేసిన లాయర్ బేబీ కృష్ణ(ఆర్.జే బాలాజీ)..వాళ్లకు సాయం చేస్తున్నట్లు నటిస్తూ.. దోచుకోవడం మొదలుపెడతాడు. కావాలనే కేసును నెలల తరబడి సాగదీస్తాడు. మీను తండ్రికి ఓపిక నశించి.. చేసేదేం లేక కోర్టు ఎదుటే ఉన్న వీరభద్రుడు స్వామిని (సూర్య)ను వేడుకుంటాడు. న్యాయం కోసం ఆ దేవుడే కిందకి దిగొస్తాడు. మనిషిగా భూమికి మీదకు వచ్చిన వీరభద్రుడు స్వామి.. మీనుకి న్యాయం చేశాడా? అవినీతి కంపులో మునిగిపోయి బేబీ కృష్ణకు, ఇతర లాయర్లకు ఆయన ఎలాంటి బుద్ది చెప్పాడు? అనేదే ఈ సినిమా కథ.
ఎలా ఉందంటే..
ప్రస్తుతం న్యాయ వ్యవస్థ పనితీరు ఎలా ఉందో అందరికి తెలిసిందే. ఒక కేసుని పరిష్కరించడానికి నెలల సమయం పడుతుంది. డబ్బులు ఉన్నవాడికే ‘న్యాయం’ జరుగుతున్న రోజులివి. సామాన్యుడు న్యాయం కోసం కోర్టుని ఆశ్రయిస్తే.. ఏళ్ల తరబడి నిరీక్షణ తప్పదు. అప్పటికీ సరైన న్యాయం జరుగుతుందా అంటే అనుమానమే. అవినీతి కంపులో న్యాయ వ్యవస్థ మునిగిపోయిందనే ఆరోపణలు ఉండనే ఉన్నాయి. చివరకు ఆ దేవుడే దిగివచ్చినా.. ప్రస్తుత న్యాయవ్యవస్థను బాగు చేయలేడు అనేది వినోదాత్మకంగా ‘వీరభద్రుడు’ సినిమాలో చెప్పాడు దర్శకుడు ఆర్.జే బాలాజీ. దర్శకుడు ఎంచుకున్న పాయింట్, దాని చుట్టు అల్లుకున్న సన్నివేశాలు బాగున్నాయి. కోర్టులో జరుగుతున్న అవినీతిని, సామాన్యులకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు.
కానీ సూర్య స్థాయి లాంటి హీరోని పక్కన పెట్టి.. ఆర్.జే బాలాజీ పోషించిన బేబీ కృష్ణ పాత్రను హైలెట్ చేయడమే ఇబ్బందికరంగా అనిపిస్తుంది. సినిమా మొదలైన అరగంట వరకు సూర్య తెరపై కనిపించడు. సూర్య ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఆర్జే బాలజీ పాత్రకే మంచి సన్నివేశాలు ఉంటాయి. అయితే క్లైమాక్స్‌లో మాత్రం వీరభద్రుడు(సూర్య) తాండవం అదిరిపోతుంది.
మీను పాత్రతో పరిచయం చేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. నగలు అమ్మి చికిత్స చేసుకోవాలని నగరానికి వచ్చిన తండ్రి కూతుళ్లపై దొంగలు దాడి చేసి బంగారం ఎత్తుకెళ్లడం.. కేసు పెట్టి, కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. అయినప్పటికీ సూర్య ఎంట్రీ లేకపోవడంతో కథనం నెమ్మదిగా సాగుతుందనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక వీరభద్రుడు ఆగమనం తర్వాత కథనం పరుగులు పెడుతుంది. ఫస్టాఫ్ మొత్తం ఎమోషనల్‌గా సాగుతుంది. కోర్టు డ్రామా ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ సీన్ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది.
అయితే సెకండాఫ్‌లో ఫాంటసీ ఎలిమెంట్స్ ఆకట్టుకోకపోగా..చిరాకుగా అనిపిస్తుంది. న్యాయం కోసం దేవుడు చేసే పనులు సిల్లీగా అనిపిస్తాయి. ఫస్టాఫ్‌లో ఎమోషన్ మీద దృష్టిపెట్టిన దర్శకుడు..ద్వితియార్థంలో మాత్రం మాస్ ఎలిమెంట్స్‌పైనే ఫోకస్ పెట్టాడు. సూర్యతో వచ్చే యాక్షన్ సన్నివేశాలు.. పాటలు పెద్దగా ఆకట్టుకోవు. కథనం కూడా అక్కడక్కకే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్‌లో వీరభద్రుడు తాండవం ఆకట్టుకుంటుంది. తమిళ వాసనలు ఎక్కువగా ఉండడం.. సూర్య పాత్ర నిడివి తక్కువగా ఉండడం ఈ సినిమాకు మైనస్.
ఎవరెలా చేశారంటే..
వీరభద్రుడు పాత్రలో సూర్య ఒదిగిపోయాడు. సామాన్య మనిషిగా, దేవుడిగా రెండు విభిన్నమైన పాత్రలను పోషించి..తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. క్లైమాక్స్‌లో వీరభద్రుడు తాండవం అదిరిపోతుంది. లాయర్ ప్రీతిగా త్రిష చక్కగా నటించింది. ఫస్టాఫ్‌లో ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా.. సెకండాఫ్‌లో మాత్రం ఒకటి రెండు మంచి సీన్లు పడ్డాయి.
ఇక దర్శకుడు ఆర్.జే బాలాజీ పోషించిన బేబీ కృష్ణ పాత్ర ఈ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఆ పాత్రలో బాలాజీ ఒదిగిపోయాడు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేర బాగానే నటించారు. సాంకేతికంగా ఈ సినిమా పర్వాలేదు. సాయి అభ్యంకర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు అంతగా ఆకట్టుకోవు. సినిమాటోగ్రఫీ బాగుంది. కానీ వీఎఫ్‌ఎక్స్ పనితీరు తేలిపోయింది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.


