‘వాలా 2 ’మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌ | Vaazha 2 Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Vaazha 2 Telugu Review: మలయాళ బ్లాక్‌ బస్టర్‌ ‘వాలా 2’ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందా?

Apr 24 2026 9:07 AM | Updated on Apr 24 2026 2:49 PM

Vaazha 2 Movie Review And Rating In Telugu

టైటిల్‌: వాలా 2
నటీనటులు:హషిర్‌ హెచ్‌, అలన్‌ బిన్‌ సిరాజ్‌, బిజు కుట్టన్‌, అజిన్‌ జాయ్‌, వినాయక్‌ వి తదితరులు 
నిర్మాణ సంస్థ: షైన్‌ స్క్రీన్స్‌
రచన: విపిన్‌ దాస్‌
దర్శకత్వం: సావిన్‌ ఎస్‌ఏ
విడుదల తేది: ఏప్రిల్‌ 24, 2026

విభిన్నమైన కథాంశాలతో ప్రస్తుతం మలయాళం చిత్రాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టిస్తున్నాయి. తెలుగులోనూ మలయాళ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. అందుకే అక్కడ బ్లాక్‌ బస్టర్‌ అయిన సినిమాలను ఇక్కడ రిలీజ్‌ చేస్తున్నారు. అలా రిలీజ్‌ అయిన తాజా చిత్రమే వాలా 2. మలయాళంలో ఏప్రిల్‌ 2న విడుదలైన ఈ చిత్రం అక్కడ ఇప్పటికే రూ. 210 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. భారీ అంచనాల మధ్య నేడు(ఏప్రిల్‌ 24) తెలుగులో రిలీజైన ఈ మలయాళ బ్లాక్‌ బస్టర్‌ టాలీవుడ్‌ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం.

కథేంటంటే.. 
నలుగురు విలేజ్‌ కుర్రాళ్ల చుట్టూ తిరిగే కథ ఇది. మిడిల్‌ క్లాస్‌కు చెందిన హాషిర్‌, అలన్‌, వినాయక్‌, అజిన్‌ మంచి స్నేహితులు. తల్లిదండ్రులు కష్టపడి కాలేజీకి పంపిస్తే.. వాళ్లు మాత్రం అక్కడ చదువు మీదకంటే..అల్లరి పనులపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అమ్మాయిలకు సైట్‌ కొట్టడం.. గొడవలు..రోజు ఇదే పని. ఓ సారి ఈ అల్లరి హద్దు దాటి, డ్రగ్స్‌ సేవించి టీచర్‌పై చేయి చేసుకోవడం దాకా వెళ్తుంది. దీంతో ఈ నలుగురిని కాలేజీ నుంచి బయటకు పంపించే పరిస్థితి ఏర్పడుతుంది. లోకస్‌ ఎస్సై (ఆల్ఫోన్స్ పుత్రన్‌) కలగజేసుకొని వీళ్లను కాపాడతాడు. ప్రిన్సిపల్‌తో మాట్లాడి పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తాడు. సమాజం మాత్రం వీరిని లూజర్‌గానే చూస్తుంది. వీళ్లు మాత్రం ఎలాగైనా ఇంటర్‌ పాసై.. ఉన్నత చదువు కోసం, ఉపాది కోసం యూకే వెళ్లాలనుకుంటారు. మరి వీరి కల నెరవేరిందా? పరీక్షల్లో ఈ నలుగురూ పాసయ్యారా? యూకే వెళ్లిన అలన్‌, వినాయక్‌కు ఎదురైన సమస్యలు ఏంటి? అజిన్‌ దుబాయ్‌కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? హాషిర్‌ ఊర్లోనే ఎందుకు ఉండిపోయాడు? కళాశాల నుంచి బయటకు వచ్చాకా ఈ నలుగురి జీవితాల్లో ఎలాంటి మలుపులు వచ్చాయి? అన్నదే మిగతా కథ. 



ఎలా ఉందంటే.. 
మలయాళ సినిమాలలో చాలా వరకు వాస్తవికానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఒక సింపుల్‌ పాయింట్‌ తీసుకొని..దానికి ఎమోషన్స్‌ జోడించి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా తెరకెక్కిస్తుంటారు. స్టార్స్‌ లేకున్నా..ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. అలా తెరకెక్కిన మరో మలయాళ ఆణిముత్యమే ఈ వాలా 2. 2024లో వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘వాలా’కు కొనసాగింపు ఇది. ఆ సినిమా మాదిరే ఈ కథ కూడా కాలేజీ కుర్రాళ్ల చుట్టూనే తిరుగుతుంది. 

అయితే ఇక్కడ తోబుట్టువుల అనుబంధంతో పాటు విదేశాలకు వెళ్లిన యువతరం కష్టాలను మనసుకు హత్తుకునేలా చూపించారు. వాలా మాదిరే ఈ చిత్రం కూడా ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతూ.. చివరిలో కన్నీళ్లను పెట్టిస్తుంది. ప్రేక్షకులు కథకు కనెక్ట్‌ అయి.. భావోద్వేగానికి గురయ్యేలా చేయడంతో దర్శకుడు సావిన్ ఎస్.ఏ, రచయిత విపిన్ దాస్ వందశాతం సక్సెస్‌ అయ్యారు.

హాషిర్‌, అలన్‌ల బాల్యం సన్నివేశాలతో సినిమా ప్రారంభం అవుతుంది. తమ్ముడు పుట్టిన తర్వాత హాషిర్‌, చెల్లి పుట్టిన తర్వాత అలన్‌ పడే ఇబ్బందులను కామెడీగా చూపించి.. కథను కాలేజీ టర్న్‌ చేశారు. అక్కడ స్నేహాలు.. ప్రేమలు, చిన్న చిన్న గొడవలు ఇవన్నీ ప్రతి ఒక్కరికి కాలేజీ డేస్‌ని గుర్తుకు తెస్తాయి. ప్రస్తుతం కాలేజీ చదువుతున్న యువతకు అయితే ఈ నలుగురి పాత్రలను తమలోనో లేదా తమ స్నేహితుల్లోనూ చూసుకుంటారు. థియేటర్స్‌లో పోలీసు అధికారిపై వేసే పంచులు, ముజీబ్‌ సార్‌ ఎపిసోడ్ కడుపుబ్బా నవ్విస్తాయి. ఫస్టాఫ్‌ అంతా ఇలా ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. 

ఇక సెకండాఫ్‌ మాత్రం చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. ప్రథమార్థం ఎంత నవ్వులు పూయిస్తుందో.. ద్వితియార్థం అంత ఎమోషనల్‌కు గురి చేస్తుంది. మధ్యతరగతి యువత కష్టాలను, కెరీర్‌ టెన్షన్స్‌తో పాటు తోబుట్టువుల బంధం, పెరెంట్స్‌ పడే ఇబ్బందులను గుండెను పిండేసేలా చూపించారు. పతాక సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి.

ఎవరెలా చేశారంటే.
ఇందులో నటించవారంతా కొత్తవాళ్లే. అయినా కూడా చక్కగా నటించారు. హాషిర్, అలెన్, అజిన్, వినాయక్  పాత్రలు మన నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయి. వీరి మధ్య ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయింది. ప్రతిఒక్కరు చాలా సహజంగా నటించి మెప్పించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. సంగీతం, ఎడిటింగ్‌ బాగా కుదిరింది. డబ్బింగ్‌ కూడా చక్కగా కుదరడంతో ఇది మలయాళ సినిమా అనేదే మర్చిపోతాం.నిర్మాణ విలువలు బాగున్నాయి. 
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌ 

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement