టాలీవుడ్‌లో చిన్న సినిమాలను జనాలు అస్సలు పట్టించుకోరు. వారంలో రెండు, మూడు చిన్న సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్తుంటాయి. అదీ మన టాలీవుడ్‌లో చిన్న చిత్రాల పరిస్థితి. కంటెంట్ ఉంటేనే అంతో ఇంతో జనాలు ఆదరిస్తున్నారు. మరి మలయాళ ఇండస్ట్రీలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. మలయాళంలో రిలీజైన చిన్న సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద కోట్లు రాబడుతున్నాయి. ఇటీవలే వాలా-2 మూవీ ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన ఐదో సినిమాగా ఘనత దక్కించుకుంది.
మలయాళ ఇండస్ట్రీలో వాలా-2 ప్రభంజనం కొనసాగుతుండగానే మరో సినిమా సైతం దూసుకెళ్తోంది. వారం రోజుల గ్యాప్‌లో రిలీజైన భరతనాట్యం- 2 మోహినియాట్టం అనే చిన్న మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 21.50 కోట్లు వసూలు చేసింది. తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా అదరగొడుతోంది. వాలా-2 నుంచి పోటీ ఉన్నప్పటికీ వసూళ్ల పరంగా ఏమాత్రం తగ్గడం లేదు. ఇలా చిన్న సినిమాలతో కోట్లు గడించడం కేవలం మలయాళ ఇండస్ట్రీకే సాధ్యమవుతోంది.
ఈ సినిమా కేవలం కేరళలో మాత్రమే కాదు.. కర్ణాటకలోనూ వసూళ్లు రాబడుతోంది. ఓవర్‌సీస్‌లో రిలీజైన ఈ మూలీ యునైటెడ్ కింగ్‌డమ్, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లోనూ కలెక్షన్స్ రాబడుతోంది. దీంతో ఈ డార్క్ కామెడీ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. కాగా.. ఈ సినిమాలో సూరజ్ వెంజరమూడు, సైజు కురుప్ కీలక పాత్రల్లో నటించారు.


