
హిస్టారికల్ సినిమాలు చేస్తున్న స్టార్ హీరోలు
వెండితెరపై హిస్టరీ రిపీట్ అవుతోంది. అవును... వందల సంవత్సరాల క్రితం జరిగిన కొన్ని చారిత్రక సంఘటనలను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. ఇందుకోసం స్టార్ హీరోలు రంగంలోకి దిగారు. భారీ బడ్జెట్‌లతో నిర్మాతలు, సూపర్ టేకింగ్‌తో దర్శకులు తీస్తున్న ఆ సినిమాల వివరాలు, ఆ చారిత్రక సంఘటనల విశేషాలను తెలుసుకుందాం.
మాస్ కాదు... ఫ్యాంటసీ
‘వీరసింహారెడ్డి’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో మరో సినిమా రానుంది. అయితే ఈ సారి ఓ చారిత్రక కథను సిద్ధం చేశారు గోపీచంద్ మలినేని. బాలకృష్ణ హీరోగా నటించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా తరహాలో ఈ సినిమా కూడా ఉంటుందని, ఈ హిస్టారికల్ డ్రామాలో మరో హీరోకి కూడా స్కోప్ ఉందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ సినిమాలో రెండో హీరోగా వెంకటేశ్ నటిస్తారని తెలిసింది. అలాగే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా తర్వాత హీరో బాలకృష్ణ–దర్శకుడు క్రిష్ కాంబినేషన్‌లో మరో సినిమా రానుందని, ఇది హిస్టారికల్ డ్రామా అనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తండ్రీకొడుకుల ఎమోషన్
‘ఎల్2: ఎంపురాన్, తుడరుమ్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల సక్సెస్‌తో ఈ ఏడాది మంచి జోరు మీద ఉన్నారు మలయాళ హీరో మోహన్‌లాల్. అలాగే మోహన్‌లాల్ నటించిన మరో రెండు సినిమాలు ‘వృషభ, హృదయపూర్వం’ విడుదలకు సిద్ధం అవుతున్నాయి. కాగా ‘వృషభ’ సినిమా హిస్టారికల్ మూవీ అని ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ స్పష్టం చేస్తోంది. తండ్రీకొడుకుల ఎమోషన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబరు 16న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమాకు నందకిశోర్ దర్శకత్వం వహించారు. శోభా కపూర్, ఏక్తా ఆర్. కపూర్, సీకే పద్మకుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్. వ్యాస్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా ఈ సినిమాను నిర్మించారు.
సైనికుడి పోరాటం
బ్రిటిష్ పరిపాలన కాలంలో ఓ సైనికుడి వీరోచిత పోరాటం, త్యాగం, ప్రేమ... వంటి అంశాలతో ఓ హిస్టారికల్ డ్రామా సినిమా రానుంది. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తారు. హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సైనికుడిపాత్రలో నటిస్తున్నారని, 1940 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది.
భాగ్యనగరం, నైజాంలో రజాకార్ల ఆకృత్యాలు వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందట. ఈ చిత్రం షూటింగ్ సగానికిపైగా పూర్తయిందని తెలిసింది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు.
బెంగాల్‌లో డ్రాగన్
హీరో ఎన్టీఆర్–దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ‘డ్రాగన్’ (పరిశీలనలో ఉన్న టైటిల్) సినిమా రానుంది. ఇది హిస్టారికల్ డ్రామా మూవీ అని తెలిసింది. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ప్రధానంగా ఈ సినిమాలో బెంగాల్, బంగ్లాదేశ్‌ల నేపథ్యం కనిపిస్తుందట. 1850 టైమ్‌లైన్‌లో ఈ సినిమా మేజర్ కథనం ఉంటుందనే ప్రచారం సాగుతోంది. ఈ సినిమా కాన్సెప్ట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఈ విషయాన్ని పరోక్షంగా స్పష్టం చేస్తోంది.
అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో రుక్ముణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారని, విలన్‌గా మలయాళ నటుడు టోవినో థామస్ కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై కల్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొలుత ఈ సినిమాను 2026 జనవరి 9న విడుదల చేయాలనుకున్నారు. కానీ... ఆ తర్వాత 2026 జూన్ 25కు విడుదలను వాయిదా చేశారు. ఈ సినిమాకు రవిబస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
రాయలసీమ నేపథ్యంలో...
రాయలసీమలో జరిగిన కొన్ని చారిత్రక సంఘటనలతో హీరో విజయ్ దేవరకొండ ఓ హిస్టారికల్ సినిమా చేస్తున్నారు. 2018లో విజయ్ దేవరకొండతో ‘టాక్సీవాలా’ రూపంలో ఓ హిట్ అందించిన రాహుల్ సంకృత్యాన్ ఈ సినిమాకు దర్శకుడు. అతి త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. కొద్ది రోజులుగా ఈ సినిమా చిత్రీకరణ కోసం ఓ భారీ సెట్‌ను రెడీ చేస్తున్నారు మేకర్స్.
1854–1878 మధ్య కాలంలో రాయలసీమలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా, ఇప్పటివరకు ఎవరూ వెండితెరపై చెప్పని ఓ సరికొత్తపాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ తెలిపారు. విజయ్ దేవరకొండ సరసన రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇదే నిజమైతే... ‘గీతగోవిందం, డియర్ కామ్రేడ్’ చిత్రాల తర్వాత విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నా ముచ్చటగా మూడోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నట్లవుతుంది. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, భూషణ్‌కుమార్, క్రిషణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
రాజుల కథ
హీరో నిఖిల్ రెండు హిస్టారికల్ సినిమాలు చేస్తున్నారు. అందులో మొదటిది ‘స్వయంభూ’. ‘బాహుబలి’ తరహా మాదిరి రాజుల కాలం నాటి కల్పిత కథతో ‘స్వయంభూ’ సినిమా కథనం ఉంటుంది. సంయుక్త, నభా నటేశ్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. తాజా షెడ్యూల్ చిత్రీకరణ ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రారంభం కానుందని తెలిసింది.
ఠాగూర్ మధు సమర్పణలో ఈ భారీ బడ్జెట్ సినిమాను భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలయ్యే అవకాశం ఉంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై ఓ స్పష్టత రానుంది. అలాగే నిఖిల్ హీరోగా చేస్తున్న మరో సినిమా ‘ది ఇండియా హౌస్’. 1905 నేపథ్యంలో కొన్ని వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా రామ్ వంశీకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల సెట్స్‌లో జరిగిన ఓ చిన్న ప్రమాదం కారణంగా ఈ సినిమా చిత్రీకరణ తాత్కాలికంగా వాయిదా పడింది.
రామ్‌చరణ్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి. మెగా పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్న ‘ది ఇండియా హౌస్’ సినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అనుపమ్ ఖేర్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా 2026 చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. 1905లో లండన్‌లో జరిగిన కొన్ని సంఘటనలు భారతదేశ స్వాతంత్య్రంపై ఏ విధంగా ప్రభావితం చూపాయి అనే కోణంలో ఈ సినిమా కథనం సాగుతుందట. స్వాతంత్య్ర సమరయోధుడు వీర్ సవార్కర్‌కు చెందిన సంఘటనలు కూడా ఈ సినిమాలో హైలైట్‌గా ఉంటాయట.
గోపీచంద్ శూల
ప్రేక్షకులను ఏడో శతాబ్దంలోకి తీసుకుని వెళ్లనున్నారు గోపీచంద్. ‘ఘాజీ, అంతరిక్షం’ వంటి సినిమాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సంకల్ప్ రెడ్డి డైరెక్షన్‌లో ఓ హిస్టారికల్ వార్ డ్రామా చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో గోపీచంద్ వారియర్‌గా నటిస్తున్నారు. కశ్మీర్‌లో ఓ లాంగ్ షూటింగ్ షెడ్యూల్‌ను ఆ మధ్య పూర్తి చేశారు. ఈ సినిమా ఏడో శతాబ్దం నేపథ్యంలో సాగుతుందని, ఇప్పటివరకు చరిత్రలో ఎవరూ టచ్ చేయని ఓపాయింట్‌తో తాము ఈ సినిమా చేస్తున్నామని చిత్రయూనిట్ పేర్కొంది.
గోపీచంద్ కెరీర్‌లోని ఈ హిస్టారికల్ సినిమాను భారీ బడ్జెట్‌తో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాకు ‘శూల’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా 2026 ద్వితీయార్ధంలో విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇలా హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి.
శతాబ్దాల క్రితంనాటి కథలు కాదు... కానీ సెమీ పీరియాడికల్ సినిమాలు (50–60 సంవత్సరాల క్రితం నేపథ్యంలో) మరికొన్ని ఉన్నాయి. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’, ‘దసరా’ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లోని ‘దిప్యారడైజ్’, దుల్కర్ సల్మాన్ ‘కాంత’, ఆది సాయికుమార్ ‘శంబాల’, రోషన్ మేకా ‘చాంపియన్’... ఈ కోవకి చెందిన
సినిమాలే.
కాంతార ప్రీక్వెల్
ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా మూడు హిస్టారికల్ సినిమాల్లో రిషబ్ శెట్టి నటించడం విశేషం. అది కూడా ఈ సినిమాల వరుసగా చేయడం అంటే చిన్న విషయం కాదు. పీరియాడికల్ కథలపై కన్నడ నటుడు–దర్శక–హీరో రిషబ్ శెట్టి ఎక్కువ మక్కువ చూపిస్తున్నట్లుగా ఉన్నారు. రిషబ్ వరుసగా శతాబ్దాల క్రితం నాటి కథలతో సినిమాలు చేస్తున్నారు. రిషబ్ శెట్టి హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందిన తాజా సినిమా ‘కాంతార: చాఫ్టర్ 1’. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార’ సినిమాకు ఇది ప్రీక్వెల్‌గా రానుంది.
‘కాంతార’ సినిమా కథ 1847లో మొదలై 1970లో జరిగే కొన్ని సన్నివేశాలతో కొనసాగుతుంది. అయితే ప్రధానంగా 1990 బ్యాక్‌డ్రాప్‌లో మేజర్ సినిమా కథనం సాగుతుంది. ‘కాంతార’ సినిమా కథ 1847లో మొదలైంది కనుక ‘కాంతార’ ప్రీక్వెల్ ఇంకా ముందు జరిగిన కథగా ఉంటుంది. ఈ ప్రకారం ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా కనీసం రెండు వందల సంవత్సరాల క్రితం జరిగిన కథగా ప్రేక్షకుల ముందుకు రావొచ్చు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ్ర΄÷డక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రం అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానుంది.
తిరుగుబాటుదారుడి కథ: ‘జై హనుమాన్’ సినిమా తర్వాత రిషబ్ శెట్టి తెలుగులో మరో సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. కన్నడ, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ సినిమాకు అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తారు.18వ శతాబ్దంలో భారత్‌లో అల్లకల్లోలంగా ఉన్న బెంగాల్ ప్రావిన్స్‌లో ఒక తిరుగుబాటుదారుడు ఎదిగిన క్రమం నేపథ్యంలో ఈ సినిమా చేయనున్నారు రిషబ్ శెట్టి. ఈ ఫిక్షనల్ హిస్టారికల్ డ్రామాలో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.
మొఘల్ సామ్రాజ్యాన్ని సవాల్ చేసిన యోధుడు: ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ సినిమా తెరకెక్కనుంది. ఈ బయోపిక్‌కు సందీప్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ హిస్టారికల్ డ్రామా 1630– 1680 మధ్యకాలంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఆల్రెడీ ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
మొఘల్ సామ్రాజ్యాన్ని సవాల్ చేసి అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన ఓ యోధుడి కథగా ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ సినిమా రానుందని, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఏకకాలంలో 2027 జనవరి 21న రిలీజ్ చేస్తామని ఈ చిత్ర సంగీత దర్శకుడు సందీప్ రాజ్ ఆ మధ్య ఓ సందర్భంలో పేర్కొన్నారు. ఇలా.. రెండు సంవత్సరాల వ్యవధిలో మూడు హిస్టారికల్ డ్రామా కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు రిషబ్ శెట్టి. – ముసిమి శివాంజనేయులు