‘చిత్రం’గా ఫ్రెండ్​ రోల్‌ నుంచి హీరోగా..

Uday Kiran First Movie Chitram Completed 21 Years - Sakshi

టాలీవుడ్​లో యువ నటుడు ఉదయ్​ కిరణ్​ది ఒక ప్రత్యేకమైన శకం. కెరీర్​లో తొలి మూడు చిత్రాలు సూపర్ హిట్స్​ సాధించి.. ‘హ్యాట్రిక్​ హీరో’ ట్యాగ్​ను తన ముందర చేర్చుకున్నాడు. యూత్​లో మంచి క్రేజ్​ దక్కించుకున్నాడు. అయితే తర్వాతి రోజుల్లో కెరీర్‌ డౌన్ ఫాలోతోనే కొనసాగి.. చివరికి ఉదయ్‌ కిరణ్‌ జీవితం విషాదంగా ముగిసింది. అయితే ఏ హీరోకైనా కెరీర్​లో ఫస్ట్​ మూవీ ప్రత్యేకం. అలాగే ఉదయ్​కు కూడా ‘చిత్రం’ ఉంది. ఈ ట్రెండ్ సెట్టర్​ మూవీ 21 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా... 

వెబ్‌డెస్క్‌: ‘చిత్రం.. ది పిక్చర్’​ తెలుగు రొమాంటిక్​ కామెడీ ఎంటర్​టైనర్ మూవీ​. కొత్త‌‌‌‌-పాత ఆర్టిస్టులు, కొత్త​ టెక్నిషియన్ల కలయికతో రూపుదిద్దుకుంది చిత్రం. కేవలం నెలన్నర రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ఆర్పీ పట్నాయక్​ అందించిన ఆడియో సాంగ్స్​తో సగం హిట్ సాధించగా, తేజ యూత్​ఫుల్​ సబ్జెక్ట్ ప్రజంటేషన్​తో సెన్సేషన్​ హిట్ అయ్యింది. ఉదయ్​ కిరణ్​, రీమా సేన్, చిత్రం శీను&కో.. ఇలా ఎందరో ఆర్టిస్టుల కెరీర్​కు ఈ మూవీ ఒక పాథ్​ను ఏర్పరిచింది. 

ఫ్రెండ్​ నుంచి.. 
నిజానికి ఈ సినిమాలో ఉదయ్​ కిరణ్​ కంటే ముందే వేరే కుర్రాడిని హీరోగా అనుకున్నాడట డైరెక్టర్​ తేజ. ఈ విషయాన్ని స్వయంగా తేజ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఉదయ్​ కిరణ్​ ముందుగా ఫ్రెండ్స్​లో ఓ క్యారెక్టర్. హీరోగా చేస్తానన్న వ్యక్తి వెనక్కి తగ్గడంతో.. ఉదయ్​ను హీరోగా ముందుకు తెచ్చాడు తేజ. అయితే మళ్లీ ఆ కుర్రాడు ముందుకు రావడంతో.. ఉదయ్​ను మళ్లీ ఫ్రెండ్​ క్యారెక్టర్​కే సెట్ చేశారు. అయితే షూటింగ్​కి సరిగ్గా ముందురోజే మళ్లీ ఆ వ్యక్తిని వద్దనుకుని.. తేజ ఉదయ్​ కిరణ్​నే హీరోగా ఫైనలైజ్​ చేశాడు తేజ. ఇక షూటింగ్ మొదట్లో ఉదయ్​ కిరణ్​ తడబడడంతో.. పక్కకు తీసుకెళ్లి తన స్టైల్​లో క్లాస్​ పీకాడట తేజ. ఆ తర్వాత ఉదయ్​ కిరణ్​ తనకు(తేజ) కావాల్సినట్లుగా యాక్ట్​ చేయడం, ‘చిత్రం’ సూపర్ హిట్ కావడం జరిగిపోయానని తేజ ఆ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు.

సబ్జెక్ట్ కొత్తదే, అయినా.. 
మిడిల్​ క్లాస్​ కుర్రాడు రమణ(ఉదయ్​ కిరణ్​), ఫారిన్​ రిటర్ని జానకీ(రీమాసేన్​).. ఈ ఇద్దరి టీనేజర్ల ప్రణయగాథే ‘చిత్రం’ థీమ్​. టీనేజీ వయసులో ఇన్​ఫాక్చుయేషన్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది తనదైన ట్రీట్​మెంట్​తో ఇందులో చూపించాడు తేజ.​ పనిలో పనిగా కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్​, అందమైన పాటలు అందించాడు. అయితే  కొద్దిపాటి అడల్ట్​ థీమ్​ ఉండడం, టీనేజీలో గర్భం, పైగా ఉషాకిరణ్​ మూవీస్​ బ్యానర్​ నుంచి ఈ మూవీ రావడంతో క్రిటిక్స్​ కొద్దిపాటి విమర్శలు చేశారు. కానీ, యూత్​ థియేటర్లకు పోటెత్తడంతో 42 లక్షల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా బంపర్​ సక్సెస్​ సాధించింది. అప్పటికి ఇరవై ఏళ్ల వయసున్న ఉదయ్​ కిరణ్​.. ఫ్లస్​ టూ స్టూడెంట్​ రమణ క్యారెక్టర్​తో అలరించి చాక్లెట్​ బాయ్ ట్యాగ్​కు తొలి బీజం వేసుకున్నాడు.

కన్నడలో 125రోజులు
చిత్రం సినిమాను రీమా సేన్‌కు కోలీవుడ్‌లో దక్కిన కొద్దిపాటి గుర్తింపు కారణంగా డబ్‌ చేశారు. అయితే కోలీవుడ్‌ వెర్షన్‌ కోసం మణివణ్ణన్‌, సెంథిల్‌, ఛార్లీ, మనోరమా, కల్పనలతో కొన్ని సీన్లను రీషూట్‌ చేశారు. ఇక 2001లో తెలుగు చిత్రం మూవీ కన్నడలో ‘చిత్ర’ పేరుతో రీమేక్‌ అయ్యింది. నాగేంద్ర ప్రసాద్‌, రేఖ వేదవ్యాస(ఆనందం ఫేమ్‌) లీడ్‌ రోల్‌లో నటించిన ఈమూవీ బ్లాక్‌బస్టర్‌ టాక్‌ దక్కించుకుని.. థియేటర్లలో 125 రోజులు ఆడింది.

చదవండి: ఇరవై ఏళ్ల తర్వాత చిత్రం.. రిపీట్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top