మహేశ్‌కి నా గొంతు సూట్ అవ్వలేదు.. అందుకే ఫ్లాప్ | Rp Patnaik About Mahesh Babu Nijam Movie Experience Latest | Sakshi
Sakshi News home page

Mahesh Babu: మహేశ్‌ అలాంటి పాత్ర.. ప్రేక్షకులకు నచ్చలేదు

Feb 2 2026 5:19 PM | Updated on Feb 2 2026 5:51 PM

Rp Patnaik About Mahesh Babu Nijam Movie Experience Latest

ఇప్పుడంటే టాలీవుడ్‌లో తమన్, దేవిశ్రీ ప్రసాద్ హవా చూపిస్తున్నారు కానీ 2000-10 మధ్యలో వరస సినిమాలతో చాలా గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్. చాలా తక్కువ టైంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. చిత్రం, నువ్వు నేను, జయం, మనసంతా నువ్వే, నీ స్నేహం, సంతోషం తదితర చిత్రాలతో మ్యూజికల్ హిట్స్ అందుకున్నారు. అలాంటి ఈయన.. మహేశ్ బాబు సినిమాకు పాటలు పాడి తప్పు చేశానని అంటున్నారు. గతంలోనే ఈ విషయం చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి అదే అన్నారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)

''నిజం' కంటే ముందు 'ఒక్కడు' రిలీజ్ కాకపోయుంటే.. 'నిజం' ఫలితం వేరేలా ఉండేది. ఎందుకంటే 'ఒక్కడు' విడుదలైన తర్వాత ఇది చిన్న సినిమా అయిపోయింది. 'ఒక్కడు'లో హీరోయిజం ఫుల్ ఎలివేట్ అయిపోయిన తర్వాత 'నిజం' వచ్చేసరికి హీరోని తల్లిచాటు బిడ్డగా అంగీకరించలేకపోయారు. పాటల విషయానికొస్తే.. నా గొంతుతోనే పాడేశాను. కానీ విడుదలైన తర్వాత వేరే వాళ్లతో పాడించుంటే బాగుండేదని కృష్ణ(మహేశ్ తండ్రి) ఫోన్ చేసి చెప్పారు. వాయిస్ వేరే వాళ్లు కూడా ఉంటే బాగుండేమో చూడండి అని అన్నారు. నిజంగా అప్పుడు ప్రయత్నించాం. తెలుగుని తెలుగులా పాడే వాళ్లతో పాడించాలనేది నా ఉద్దేశం. తెలుగుని ఖూనీ చేసేవాళ్లతో నేను పాడించను. శంకర్ మహదేవన్, కేకే.. వీళ్ల వాయిస్ నాకు ఓకే. కానీ రికార్డింగ్ టైంకి వాళ్లు అందుబాటులో లేరు. దీంతో నేను పాడేశా. నా వాయిస్ మహేశ్‌కి సూట్ కాలేదు. అది నేను ఒప్పుకొంటాను' అని ఆర్పీ పట్నాయక్ చెప్పుకొచ్చారు.

2003లో మహేశ్ బాబు హీరోగా చేసిన రెండు సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో మొదటగా వచ్చిన 'ఒక్కడు' బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీని తర్వాత కొన్ని నెలలకు 'నిజం' థియేటర్లలోకి వచ్చింది. తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేశ్.. భయస్తుడిగా, తల్లిచాటు బిడ్డగా నటించాడు. ఇది ఘోరంగా ఫ్లాప్ అయింది. ఈ మూవీలో మహేశ్ లుక్ కూడా ఏమంత ఇంప్రెసివ్‌గా ఉండదు. ఇప్పుడు ఆర్పీ పట్నాయక్ ఇంటర్వ్యూ వల్ల 'నిజం' మరోసారి చర్చనీయాంశమైంది.

ఆర్పీ పట్నాయక్ విషయానికొస్తే.. కెరీర్ పీక్‌లో ఉండగానే సంగీత దర్శకత్వాన్ని పక్కనబెట్టారు. దర్శకుడు కొన్ని సినిమాలు చేశారు గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతానికైతే ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నారు. మహేశ్ బాబు విషయానికొస్తే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'వారణాసి' చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ మూవీ థియేటర్లలోకి రానుందని ఇటీవలే ప్రకటించారు.

(ఇదీ చదవండి: ధనుష్ నాకు అన్నలాంటోడు.. మృణాల్ ఇలా అనేసిందా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement